Share News

శుభ్‌మన్ గిల్ సుదీర్ఘకాలం కెప్టెన్‌గా కొనసాగుతాడు: విరాట్ కోహ్లీ

ABN , Publish Date - Sep 26 , 2026 | 02:36 PM

భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భవిష్యత్తుపై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు గిల్ సుదీర్ఘకాలం నాయకత్వం వహిస్తాడని అభిప్రాయపడ్డాడు.

శుభ్‌మన్ గిల్ సుదీర్ఘకాలం కెప్టెన్‌గా కొనసాగుతాడు: విరాట్ కోహ్లీ
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భవిష్యత్తుపై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు గిల్ సుదీర్ఘకాలం నాయకత్వం వహిస్తాడని అభిప్రాయపడ్డాడు. జట్టును సరైన దారిలో ముందుకు నడిపించాలనే తపన అతడిలో చాలా ఉందని తెలిపాడు. వెస్టిండీస్‌తో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరగనున్న తొలి వన్డేకు ముందు కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.


‘కెప్టెన్‌గా గిల్ ఇంకా నేర్చుకుంటున్నాడు. ఈ బాధ్యతలు చేపట్టి ఎక్కువ కాలం కాలేదు. అయినప్పటికీ టీమిండియాను నడిపించేందుకు కావాల్సిన లక్షణాలన్నీ అతడిలో ఉన్నాయి. ఫీల్డింగ్‌లో ప్లేయర్లను ఎలా మోహరించాలి? బౌలర్లను ఎలా ఉపయోగించుకోవాలి? అనే విషయాల్లో గిల్‌కు స్పష్టత ఉంది. ప్రత్యర్థి బ్యాటర్లను ఎలా ఔట్ చేయాలనే దానిపై అతడు ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. ఇది ప్రత్యర్థుల కంటే ఒక అడుగు ముందుండే లక్షణం. అనుభవం పెరిగే కొద్దీ పరిస్థితులను అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవడంతో మరింత మెరుగవుతాడు. భారత జట్టును సరైన దారిలో నడిపించాలనే తపన గిల్‌లో ఉంది. అదే చాలా ముఖ్యమైన విషయం కూడా. అందుకే అతడు సుదీర్ఘ కాలం భారత జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతాడని భావిస్తున్నా’ అని విరాట్ కోహ్లీ వెల్లడించాడు.


బ్యాటింగ్‌లో మరింత స్వేచ్ఛగా..

ఇక తన బ్యాటింగ్‌లో వచ్చిన మార్పులపైనా కోహ్లీ స్పందించాడు. ఇటీవల వన్డేల్లో అద్భుత ఫామ్‌లో ఉన్న అతడు.. గత 10 మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు, 90కిపైగా పరుగులతో ఒక ఇన్నింగ్స్‌, నాలుగు అర్ధసెంచరీలు నమోదు చేశాడు.

‘స్వేచ్ఛగా ఆడటమే ఇటీవల నా బ్యాటింగ్‌లో వచ్చిన ప్రధాన మార్పు. చాలాకాలంగా జట్టును కష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించడమే నా పాత్రగా ఉండేది. ఇప్పుడు నేను క్రీజులో కుదురుకున్నప్పుడు జట్టుకు మరో 30-40 పరుగులు అదనంగా అందించేలా ఆడాలని నిర్ణయించుకున్నా. రిస్క్‌ తీసుకోకపోతే.. తర్వాతి దశలో వేగం పెంచేందుకు అది ఉపయోగపడేలా పరిస్థితిని ఏర్పాటు చేసుకుంటా. సరైన సమయంలో యాక్సిలరేటర్‌ను నొక్కాలన్నదే నా ఆలోచన. పిచ్‌, పరిస్థితులు అనుకూలంగా ఉంటే 350-360 పరుగులు చేయగల సామర్థ్యం మనకు ఉంది. అందుకే ఇప్పుడు రిస్క్‌లు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఎక్కువసేపు క్రీజులో ఉంటే చివర్లో మరింత వేగంగా పరుగులు చేయగలను. అదే జట్టుకు ఉపయోగపడుతుంది’ అని కోహ్లీ పేర్కొన్నాడు.


ఇవీ చదవండి:

మెట్రో టికెట్ బాక్సులో పిల్లి కునుకు.. వీడియో వైరల్‌

బీట్‌కు తగ్గట్టుగా స్టెప్పులు.. రోబో డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా

Updated Date - Sep 26 , 2026 | 02:37 PM