18 ఏళ్ల ప్రయాణం నా కళ్ల ముందు మెదిలింది: విరాట్ భావోద్వేగం
ABN , Publish Date - Mar 23 , 2026 | 12:51 PM
ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ.. ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. అయితే తాజాగా విరాట్ ఆ క్షణాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ.. ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఒకే జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోన్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. రజత్ పాటీదార్ నాయకత్వంలో ఆర్సీబీ జట్టు సగర్వంగా ట్రోఫీని ఎత్తింది. అయితే తాజాగా విరాట్ ఆ క్షణాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
‘గత సీజన్‌లో మేం చాలా కష్టపడ్డాం. ఫైనల్‌కు చేరుకున్న తర్వాత నాకు కొంచెం మనశ్శాంతిగా అనిపించింది. ఎలాగైనా కప్పు కొట్టబోతున్నామనే నమ్మకం కలిగింది. ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌పై పోటీకి దిగాం. మాలాగే ఆ జట్టూ తొలిసారి ట్రోఫీ అందుకోవాలని ఉవ్విళూరుతోంది. గొప్ప ప్రదర్శన కనబర్చి ఫైనల్ వరకు చేరింది. కానీ మా కుర్రాళ్లు చాలా కష్టపడ్డారు. ఆఖరి ఓవర్లో ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే మా విజయం ఖాయమైంది. కానీ ఆ మూడు బంతులు వేయించే వరకు వేచి చూడాల్సిందే. నా కెరీర్‌లోనే ఆ క్షణాలు అత్యంత కఠినమైనవి.
‘18 ఏళ్ల పాటు జట్టుతోనే ఉన్నా. ఈ ప్రయాణంలో నేను అనుభవించిన ఎత్తుపల్లాలు, నా అనుభవాలు అన్నీ ఆ క్షణం నా కళ్ల ముందు మెదిలాయి. అది మాటల్లో చెప్పలేని ఆనందం. 2009లో డెక్కన్ ఛార్జర్స్, 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల చేతిలో ఫైనల్ మ్యాచ్‌ల్లో ఓడిపోయాం. ఆ ఓటములే మాకు ప్రేరణగా మారాయి. కానీ గత సీజన్‌లో మాత్రం కష్టపడి అర్హత సాధించి ఫైనల్‌కు వచ్చాం. ఇది యాదృచ్ఛికం కాదు. అదృష్టం అంతకంటే కాదు’ అని విరాట్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
హార్దిక్.. స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకో: టీమిండియా మాజీ ప్లేయర్
ఐపీఎల్: ఒక సీజన్‌లో ఏ జట్టుకైనా హోమ్ గ్రౌండ్ ఒకటే ఉండాలి: అశ్విన్