Share News

ఇంగ్లండ్‌తో తొలి వన్డే: కోహ్లీ అరుదైన ఘనత.. పలు రికార్డులు బద్దలు కొట్టిన భారత్

ABN , Publish Date - Jul 15 , 2026 | 10:30 AM

ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. పలు రికార్డులు బద్దలు కొట్టింది. టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ అనంతరం బరిలోకి దిగిన భారత్.. ఇంగ్లండ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

ఇంగ్లండ్‌తో తొలి వన్డే: కోహ్లీ అరుదైన ఘనత.. పలు రికార్డులు బద్దలు కొట్టిన భారత్
India vs England

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. పలు రికార్డులు బద్దలు కొట్టింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అక్షర్ పటేల్ బంతితోనూ, బ్యాట్‌తోనూ చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్ వరుస విజయాలకు దీంతో బ్రేక్ పడింది. టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ అనంతరం బరిలోకి దిగిన భారత్.. ఇంగ్లండ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన రికార్డులివే..


  • 12 ఏళ్లలో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ను ఓడించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. ఈ వేదికపై ఇంగ్లండ్ 2015 నుంచి ఆడిన ఏడు వన్డేల్లో ఒక్కటి కూడా ఓడిపోలేదు. అయితే ఇదే ఎడ్జ్‌బాస్టన్‌లో 2014లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది కూడా టీమిండియానే కావడం విశేషం.

  • ఇంగ్లండ్‌పై వన్డేల్లో టీమిండియాకు ఇది వరుసగా ఆరో విజయం. తన లాంగ్ స్ట్రీక్‌ను భారత జట్టు విజయవంతంగా కొనసాగిస్తోంది.

  • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలమైన వేళ టీమిండియా వన్డేల్లో 250 ప్లస్ స్కోరును ఛేదించడం 2016 తర్వాత ఇది రెండోసారి. 2022లో ఓల్డ్ ట్రాఫోర్ట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో 260 పరుగుల టార్గెట్‌ను భారత్ ఛేదించింది.


కోహ్లీ ఖాతాలో మరో అరుదైన ఘనత

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే సందర్భంగా వన్డే క్రికెట్‌లో 300 ఇన్నింగ్స్ ఆడిన ఐదో భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, మహ్మద్ అజారుద్దీన్, సౌరభ్ గంగూలీ తర్వాత కోహ్లీ చేరాడు. కోహ్లీకి ఇది 312వ వన్డే మ్యాచ్. ఇప్పటివరకు 14,797 పరుగులు చేసిన అతడు 58.71 సగటు, 93.82 స్ట్రైక్‌రేట్‌తో వన్డేల్లో అద్భుతమైన రికార్డును కొనసాగిస్తున్నాడు.


ఆ ఇద్దరి సరసన అక్షర్ పటేల్..

విదేశీ గడ్డపై ఒక వన్డే మ్యాచ్‌లో నాలుగు వికెట్లు, 50కి పైగా పరుగులు చేసిన మూడో భారత ప్లేయర్‌గా అక్షర్ పటేల్ రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ ఫీట్ సచిన్ టెండూల్కర్, హార్దిక్ పాండ్య మాత్రమే సాధించారు. సచిన్ 1998లో ఆస్ట్రేలియాపై 141 పరుగులు.. 4/38 బౌలింగ్ గణాంకాలు సాధించాడు. 24 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌పై హార్దిక్ 2022లో 71 పరుగులు, 4/24 బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు.


ఇవి కూడా చదవండి:

ఇంగ్లండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు.. అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లీ

ఇంగ్లండ్‌తో సెమీస్‌కు ప్రత్యేక జెర్సీ.. ఫిఫాకు అర్జెంటీనా అభ్యర్థన

Updated Date - Jul 15 , 2026 | 10:50 AM