ఇంగ్లండ్‌తో సెమీస్‌కు ప్రత్యేక జెర్సీ.. ఫిఫాకు అర్జెంటీనా అభ్యర్థన
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:14 PM
జులై 16న అట్లాంటా వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్లు సెమీ ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ ప్రతిష్ఠాత్మక పోరు నేపథ్యంలో అర్జెంటీనా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026 తుది అంకానికి చేరుకుంది. జులై 16న అట్లాంటా వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్లు సెమీ ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ ప్రతిష్ఠాత్మక పోరు నేపథ్యంలో అర్జెంటీనా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సాంప్రదాయ జెర్సీ కాకుండా నేవీ బ్లూ ప్రత్యామ్నాయ జెర్సీతో బరిలోకి దిగనుంది. ఇందుకోసం ఫిఫా అనుమతి కోరింది. అర్జెంటీనా అభ్యర్థనకు ఫిఫా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
అర్జెంటీనా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ బలమైన కారణం ఉంది. 1986 ప్రపంచ కప్‌లో మెక్సికో వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో డిగో మారడోనా ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్‌తో పాటు ‘గోల్ ఆఫ్ ది సెంచరీ’ నమోదు చేసి అర్జెంటీనాకు 2-1 విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్‌లో అర్జెంటీనా నేవీ బ్లూ జెర్సీనే ధరించింది. అదే జెర్సీ మళ్లీ ధరిస్తే ఆ చారిత్రక విజయ జ్ఞాపకాలు జట్టుకు మానసికంగా బలం చేకూరుస్తాయని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. 1986 ప్రపంచ కప్ తర్వాత ఇరుజట్లు రెండుసార్లు తలపడ్డాయి. 1998లో 2-2తో ముగిసిన మ్యాచ్‌లో అర్జెంటీనా పెనాల్టీల్లో 4-3తో గెలిచింది. ఆ మ్యాచ్‌లో కూడా నేవీ బ్లూ జెర్సీనే ధరించింది. అయితే 2002లో సంప్రదాయ నీలం-తెలుపు జెర్సీతో బరిలోకి దిగిన అర్జెంటీనా.. డేవిడ్ బెక్‌హామ్ పెనాల్టీ గోల్‌తో 0-1 తేడాతో ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో సెమీఫైనల్‌కు జెర్సీల వివరాలను ఫిఫా అధికారికంగా ప్రకటించింది. ఇంగ్లండ్ వైట్ అండ్ వైట్ కిట్‌తో బరిలోకి దిగనుండగా.. అర్జెంటీనా నేవీ బ్లూ-బ్లాక్ ఆల్టర్నేట్ జెర్సీతో ఆడనుంది.
కాగా, ప్రపంచ కప్-2026లో అర్జెంటీనా ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడగా.. ఐదు మ్యాచ్‌ల్లో ప్రధాన జెర్సీ ధరించి అన్నింటిలోనూ విజయం సాధించింది. ఒక్కసారి మాత్రమే ఆల్టర్నేట్ జెర్సీతో బరిలోకి దిగగా.. డల్లాస్‌లో జోర్డాన్‌పై 3-1తో గెలిచింది. ఇప్పుడు అదే జెర్సీతో ఇంగ్లండ్‌పై కూడా విజయాన్ని పునరావృతం చేయాలనే లక్ష్యంతో మెస్సి సేన సిద్ధమవుతోంది. అయితే ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌పై తొలిసారి బరిలోకి దిగనున్న మెస్సికి.. ప్రత్యామ్నాయ జెర్సీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల.. చెన్నైలో తొలి మ్యాచ్..
వన్డే ప్రపంచ కప్ 2027.. రో-కో అనుభవం జట్టుకు అవసరం: గిల్