Share News

వన్డే ప్రపంచ కప్‌ 2027.. రో-కో అనుభవం జట్టుకు అవసరం: గిల్

ABN , Publish Date - Jul 14 , 2026 | 10:45 AM

టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. రానున్న వన్డే ప్రపంచ కప్ 2027లో ఆడతారా? అనే విషయంపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రో-కో భారత వన్డే జట్టుకు వెన్నెముక లాంటి వారని తెలిపాడు.

వన్డే ప్రపంచ కప్‌ 2027.. రో-కో అనుభవం జట్టుకు అవసరం: గిల్
Shubman Gill

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి వన్డేల్లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రానున్న వన్డే ప్రపంచ కప్ 2027లో వీరిద్దరూ ఆడతారా? లేదా? అనే ప్రశ్న చాలాకాలంగా వినిపిస్తోంది. టీమ్ మేనేజ్‌మెంట్ యువ ప్లేయర్ల వైపే మొగ్గు చూపుతుండటం, మరోవైపు రోహిత్, విరాట్ ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో.. వరల్డ్ కప్‌లో ఆడే అవకాశాలపై చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయంపై టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడాడు. రో-కో భారత వన్డే జట్టుకు వెన్నెముక లాంటి వారని తెలిపాడు. వారి అనుభవం జట్టుకు ఎంతో అవసరమని వెల్లడించాడు.


నేడు బర్మింగ్‌హామ్ వేదికగా భారత్.. ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు గిల్ మీడియాతో మాట్లాడాడు. ‘రెండు రోజుల క్రితమే 2027 వన్డే ప్రపంచ కప్‌కు సంబంధించిన ప్రణాళికలపై కోహ్లీతో చర్చించాను. జట్టు కాంబినేషన్ ఎలా ఉండాలి? ఏ ఆటగాళ్లు జట్టులో ఉండొచ్చు? ప్రస్తుతం టీమ్‌లో లేకపోయినా భవిష్యత్తులో కీలకంగా మారే ఆటగాళ్లు ఎవరు? వారిని ఏ స్థానాల్లో ఆడించాలి? వంటి అంశాలపై విస్తృతంగా మాట్లాడుకున్నాం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పదేళ్లుగా భారత బ్యాటింగ్‌కు అండగా నిలిచారు. ఇద్దరూ ఇప్పటికీ భారత వన్డే జట్టులో అంతర్భాగమే. వారి అనుభవం, నైపుణ్యం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు ఏ స్థాయిలో రాణించారో అందరికీ తెలుసు’ అని గిల్ తెలిపాడు.


ఇక భారత్–ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ నేటి (జులై 14) నుంచి ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్ జులై 16న, మూడో వన్డే జులై 19న జరగనుంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న 2027 వన్డే ప్రపంచ కప్‌కు ఈ సిరీస్ కీలక సన్నాహకంగా భావిస్తున్నారు. మరి ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎలా రాణిస్తారో చూడాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

సీఎస్కేకి కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్‌బై.. 18 ఏళ్ల ప్రయాణానికి తెర

ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026: భారత్‌కు ఐదు స్వర్ణాలు

Updated Date - Jul 14 , 2026 | 11:16 AM