Share News

లార్డ్స్‌లో అద్భుత విజయం.. చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు

ABN , Publish Date - Jul 13 , 2026 | 05:22 PM

భారత మహిళలు అద్భుతం చేశారు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో తొలిసారిగా ఆడిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఘన విజయం సాధించారు. ఏకంగా 270 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా చరిత్రాత్మక విజయం సాధించింది.

లార్డ్స్‌లో అద్భుత విజయం.. చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు
India Women

ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళలు అద్భుతం చేశారు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో తొలిసారిగా ఆడిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఘన విజయం సాధించారు. ఆతిథ్య ఇంగ్లండ్‌ను మట్టికరిపించి చరిత్ర సృష్టించారు. ‘హోం ఆఫ్ క్రికెట్’గా పిలిచే లార్డ్స్‌లో భారత మహిళా జట్టు.. ఇంగ్లండ్‌పై పూర్తి ఆధిపత్యం చూపించింది. ఏకంగా 270 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా చరిత్రాత్మక విజయం సాధించింది. 457 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. 186 రన్స్‌కే ఆలౌటైంది. అమీ జోన్స్‌ (54), సోఫీ ఎకిల్‌స్టోన్‌ (50) హాఫ్ సెంచరీలు చేశారు. భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా 4 వికెట్లు పడగొట్టింది. సయాలి, క్రాంతి గౌడ్‌, దీప్తి శర్మ తలో 2 వికెట్లు తీశారు.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభమే దక్కింది. స్మృతి మంధాన(83), హర్మన్ ప్రీత్ కౌర్(58), దీప్తి శర్మ(57) హాఫ్ సెంచరీలు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 285 పరుగుల స్కోర్ చేయగలిగింది. లార్డ్స్ మైదానంలో హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా స్మృతి చరిత్ర సృష్టించింది. తొలి ఇన్నింగ్స్‌లో సోఫీ ఎకిల్‌స్టన్ 3, లారెన్ ఫిలర్, ఇస్సీ వాంగ్, మ్యాడీ తలో 2 వికెట్లు, లారెన్ బెల్ ఒక వికెట్ పడగొట్టారు. ఛేదనకు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. అమీ జోన్స్(52) మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ 5 వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకుంది. సయాలీ , స్నేహ్ రాణా తలో 2 వికెట్లు, దీప్తి శర్మ ఒక వికెట్ పడగొట్టారు.


భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. యాస్తికా భాటియా(113) సెంచరీతో చెలరేగింది. లార్డ్స్‌లో సెంచరీ చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ 5, లారెన్ బెల్ 2 వికెట్లు పడగొట్టారు. 457 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. 186 రన్స్‌కే కుప్పకూలింది. లార్డ్స్‌లో తొలి సెంచరీ చేసిన యాస్తికా, 5 వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్న క్రాంతి గౌడ్.. ‘ఆనర్స్ బోర్డు’లో తమ పేర్లను లిఖించుకున్నారు. అయితే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును క్రాంతి గౌడ్ దక్కించుకుంది.


లార్డ్స్‌లో సచిన్ సందడి

లార్డ్స్‌లో భారత మహిళా జట్టు తొలిసారి టెస్టు ఆడటంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హాజరయ్యాడు. నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు భారత జట్టుతో మాట్లాడాడు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే భారత మహిళలకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. జట్టు సమావేశంలో పాల్గొని హర్మన్ సేనకు విలువైన సూచనలు చేశాడు. ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్‌తో ఇంగ్లండ్ క్రికెటర్ టామీ బౌమౌంట్, హీథర్ నైట్‌ల అంతర్జాతీయ కెరీర్ ముగిసింది.


ఇవి కూడా చదవండి:

సీఎస్కేకి కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్‌బై.. 18 ఏళ్ల ప్రయాణానికి తెర

ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026: భారత్‌కు ఐదు స్వర్ణాలు

Updated Date - Jul 13 , 2026 | 05:39 PM