అభిషేక్, వైభవ్‌లను చూస్తుంటే అల్కరాజ్, సినర్‌లు గుర్తొస్తున్నారు: యువరాజ్ సింగ్
ABN , Publish Date - Jul 13 , 2026 | 02:45 PM
భారత క్రికెట్‌లో దూకుడైన బ్యాటింగ్‌కు కొత్త నిర్వచనాన్ని ఇస్తోన్న ఆటగాళ్ల గురించి మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హాలివుడ్ చిత్రం ‘టెర్మినేటర్’ సిరీస్‌తో పోలుస్తూ తనను తాను టెర్మినేటర్‌గా అభివర్ణించుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌లో దూకుడైన బ్యాటింగ్‌కు కొత్త నిర్వచనాన్ని ఇస్తోన్న ఆటగాళ్ల గురించి మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హాలివుడ్ చిత్రం ‘టెర్మినేటర్’ సిరీస్‌తో పోలుస్తూ తనను తాను టెర్మినేటర్‌గా అభివర్ణించుకున్నాడు. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలను భవిష్యత్తు తరాల స్టార్లుగా పేర్కొన్నాడు. యువీ, అభిషేక్, వైభవ్ కలిసి వింబుల్డన్ 2026 ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యువీ మాట్లాడాడు.
‘ఎప్పుడూ నన్ను నేను టెర్మినేటర్ అని పిలుచుకుంటా. ఇప్పుడు టెర్మినేటర్-4గా అభిషేక్ శర్మ ఉన్నాడు. అతడు నా కంటే నాలుగు రెట్లు మెరుగ్గా ఉన్నాడు. ఆ తర్వాత టెర్మినేటర్-6గా వైభవ్ సూర్యవంశీ వస్తున్నాడు. అతడు ఆటను మరింత ముందుకు తీసుకెళ్తున్నాడు. జట్టు తరఫున ఆడుతున్నప్పుడు నేను నా వంతు కృషి చేశాను. అభిషేక్ దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఇప్పుడు వైభవ్ కొత్త ప్రమాణాలు సృష్టిస్తున్నాడు. ఇది ఒకే ప్రయాణంలో మూడో దశ. క్రీడ ఎలా అభివృద్ధి చెందుతుందో చూడటం గొప్ప అనుభూతి’ అని యువీ పేర్కొన్నాడు.
ఆ నమ్మకం ఉంది..
‘సినర్, అల్కరాజ్‌లను చూస్తుంటే టెన్నిస్ ఎంత అభివృద్ధి చెందిందో తెలుస్తోంది. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలను చూస్తుంటే టెన్నిస్‌లో అల్కరాజ్, సినర్‌లు గుర్తొస్తున్నారు. అభిషేక్‌తో చాలా సమయం గడిపి శిక్షణ ఇచ్చాను. భవిష్యత్తులో వైభవ్‌కు కూడా శిక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నా. అతడికి అద్భుతమైన కెరీర్ ఉంది. అతడు గొప్ప ఆటగాడిగా ఎదుగుతాడనే నమ్మకం ఉంది’ అని యువరాజ్ సింగ్ తెలిపాడు.
యువీ పాజీ నాకు ఆదర్శం: వైభవ్
తనపై యువరాజ్ చూపిన అభిమానానికి వైభవ్ కూడా స్పందించాడు. ‘యువీ పాజీ నాకు ఆదర్శ ఆటగాడు. ఆయనను తొలిసారి కలవడం ప్రత్యేకమైన అనుభూతి. ఆట గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ముఖ్యంగా మానసిక బలం, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, మనపై మనకు నమ్మకం ఎలా ఉండాలి అనే విషయాల్లో విలువైన సూచనలు ఇచ్చారు. ఆయన లాంటి వ్యక్తి నుంచి నేర్చుకునే అవకాశం రావడం నా అదృష్టం. ఇవి నా కెరీర్‌లో ఎంతో ఉపయోగపడతాయి’ అని వైభవ్ చెప్పాడు.
ఇవి కూడా చదవండి:
ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్?
వింబుల్డన్‌లో మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్