Share News

ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్?

ABN , Publish Date - Jul 13 , 2026 | 11:29 AM

ఇంగ్లండ్ టెస్టు జట్టు ప్రధాన కోచ్ కోసం ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మెక్‌కల్లమ్ స్థానంలో నియమించేందుకు ఈసీబీ ద్రవిడ్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్?
Rahul Dravid

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్ టెస్టు జట్టు ప్రధాన కోచ్ కోసం ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మెక్‌కల్లమ్ స్థానంలో నియమించేందుకు ఈసీబీ ద్రవిడ్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇంగ్లండ్ మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్, మాజీ స్పిన్నర్ రిచర్డ్ డాసన్‌లు కూడా ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇంగ్లండ్ టెస్టు వరుస పరాభవాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌పై ఈసీబీ వేటు వేసిన సంగతి తెలిసిందే.


భారత్‌కు టీ20 ప్రపంచ కప్ 2024‌ను అందించడమే కాకుండా, 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు జట్టును చేర్చిన ద్రవిడ్‌కు ఆటపై ఉన్న లోతైన అవగాహన, కచ్చితమైన ప్రణాళికలతో పనిచేసే తీరు ఈసీబీని ఆకర్షిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ద్రవిడ్ పూర్తి స్థాయి కోచింగ్ బాధ్యతలు చేపట్టాలనే ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ‘ఫుల్ ‌టైమ్ కోచ్‌గా పనిచేయాలనే ఉద్దేశం ద్రవిడ్‌కు లేదు. అయితే ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్ పదవి వల్ల అతడికి ఇంటి వద్ద ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉండటంతో పాటు, తనకు అత్యంత ఇష్టమైన టెస్టు క్రికెట్‌కు సేవలందించే అవకాశం లభిస్తుంది. కనీసం అతడి ఆసక్తిని ఈసీబీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి’ అని ఓ కథనం పేర్కొంది.


ఇక ఈ పదవికి ప్రధాన పోటీదారుల్లో ఆండీ ఫ్లవర్ ముందంజలో ఉన్నట్లు సమాచారం. ఇంగ్లండ్‌కు మూడు యాషెస్ సిరీస్ విజయాలు, ప్రపంచ నంబర్-1 టెస్టు ర్యాంకు అందించిన కోచ్‌గా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఐపీఎల్‌లో ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వరుసగా రెండు టైటిళ్లను అందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గ్లామోర్గన్ హెడ్ కోచ్‌గా ఉన్న రిచర్డ్ డాసన్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. వ్యూహాత్మక నైపుణ్యం, కౌంటీతో పాటు అంతర్జాతీయ స్థాయిలో కోచింగ్ అనుభవం ఆయనకు ప్లస్‌గా మారింది. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర, ఇంగ్లండ్ లయన్స్ కోచ్ ఆండ్రూ ఫ్లింటాఫ్, పాకిస్థాన్ ప్రధాన కోచ్ మైక్ హసన్, ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

జట్టుకు హర్షిత్- వరుణ్ చక్రవర్తి దూరం.. వారి స్థానంలో ఆ ఇద్దరు..

వైభవ్‌ను అందుకే తప్పించాం.. మౌనం వీడిన శ్రేయస్ అయ్యర్

Updated Date - Jul 13 , 2026 | 12:11 PM