వైభవ్‌ను అందుకే తప్పించాం.. మౌనం వీడిన శ్రేయస్ అయ్యర్
ABN , Publish Date - Jul 12 , 2026 | 03:32 PM
ఐదో టీ20లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని జట్టు నుంచి తప్పించడంపై చర్చ కొనసాగుతోంది. ఈ విషయంపై భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ వైట్ వాష్ అయిన సంగతి తెలిసిందే. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మిగిలిన నాలుగింట్లో భారత్ ఓటమిపాలైంది. అయితే ఐదో టీ20లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని జట్టు నుంచి తప్పించడంపై చర్చ కొనసాగుతోంది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ తక్కువ స్కోరుకే ఔట్ అవ్వడంతో జట్టు నుంచి తప్పించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అతడికి ఇంకో అవకాశం ఇచ్చి ఉండాల్సిందంటూ మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని తప్పించడంపై భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు.
‘పిచ్ పరిస్థితులకు అనువైన అత్యత్తమ కాంబినేషన్‌ను ఎంచుకోవాలని నిర్ణయించాం. అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్‌కు కుడిచేతి వాటం బ్యాటర్ అవసరమని భావించాం. అందుకే సంజు శాంసన్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నాం. వైభవ్ సూర్యవంశీని జట్టు నుంచి తప్పించడానికి అతడి ఫామ్ కారణం కాదు. సోషల్ మీడియాలో అనవసరమైన ప్రచారాలు చేయకండి. సంజు శాంసన్ అద్భుతమైన బ్యాటర్. ఎన్నో సిరీస్‌లను ఒంటిచేత్తో గెలిపించాడు. అందుకే ఈ మ్యాచ్‌కు అతడే సరైన ఎంపికగా భావించాం’ అని శ్రేయస్ పేర్కొన్నాడు.
మా ఓటమికి కారణం అదే..
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోవడంపై శ్రేయస్ స్పందించాడు. ‘ఒక వేదిక నుంచి మరో వేదికకు మారుతూ ఆడాల్సి వచ్చింది. మైదానాల పరిమాణం, పరిస్థితులకు అనుగుణంగా మేము ఆశించినంత వేగంగా అలవాటు పడలేకపోయాం. అదే సమయంలో ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. మూడు విభాగాల్లోనూ మాపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఇవన్నీ కలిసి ఈ ఫలితానికి దారితీశాయి. విదేశీ పర్యటనకు వచ్చామంటే సిరీస్ సులభంగా గెలుస్తామనే ఆలోచన ఉంటే సరిపోదు. పరిస్థితులకు తగ్గట్టు మరింత కష్టపడాలి. ఒత్తిడిని ఎదుర్కొంటూ నేర్చుకోవడం నన్ను మరింత మెరుగైన ఆటగాడిగా, కెప్టెన్‌గా తీర్చిదిద్దుతుంది. విదేశీ పరిస్థితులకు తగ్గట్టు జట్టును సిద్ధం చేయడం, ఆటగాళ్ల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం మా ప్రధాన లక్ష్యం. అదే దిశగా ముందుకు సాగుతాం’ అని అయ్యర్ స్పష్టం చేశాడు.
ఇవి కూడా చదవండి:
నాతో మర్యాదగా మాట్లాడండి.. రిఫరీతో మెస్సి వాగ్వాదం!
భారత్ వరుస ఓటములు.. కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు!