Share News

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ దిగ్గజం

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:41 PM

ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 2017 ప్రపంచ కప్ విజేత హీథర్ నైట్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. భారత్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టు ముగిసిన తర్వాత రిటైర్‌మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ దిగ్గజం
Heather Knight

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 2017 ప్రపంచ కప్ విజేత హీథర్ నైట్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. భారత్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టు ముగిసిన తర్వాత రిటైర్‌మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఇంగ్లండ్ మహిళల క్రికెట్‌లో ఓ సుదీర్ఘ అధ్యాయానికి తెరపడనుంది. రిటైర్‌మెంట్ ప్రకటిస్తూ హీథర్ భావోద్వేగానికి గురైంది.


‘ఇంగ్లండ్ తరఫున ఆడే అవకాశం రావడం నా అదృష్టం. గత 16 ఏళ్లుగా డ్రెస్సింగ్‌ రూమ్ నా జీవితంలో విడదీయరాని భాగమైంది. అక్కడి జ్ఞాపకాలు, సహచరులు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. క్రికెట్‌కు వీడ్కోలు పలకడం కష్టంగా ఉంది. కానీ నా నిర్ణయంతో సంతృప్తిగా ఉన్నాను. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని హీథర్ పేర్కొంది. కాగా ‘ది హండ్రెడ్’ టోర్నీలో పాల్గొననున్న లండన్ స్పిరిట్ జట్టుకు నైట్ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టనుంది.


2010లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన 35 ఏళ్ల నైట్.. టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి మొత్తం 320 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. ఇంగ్లండ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. అన్ని ఫార్మాట్లలో కలిపి దాదాపు 8,000 పరుగులు చేసింది. అందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. 2020 టీ20 ప్రపంచ కప్‌లో కాన్‌బెర్రా వేదికగా సెంచరీ సాధించి మూడు ఫార్మాట్లలోనూ శతకం బాదిన తొలి ఇంగ్లండ్ మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది.


ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర

2016లో షార్లెట్ ఎడ్వర్డ్స్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన నైట్.. ఏడాదికే లార్డ్స్ వేదికగా భారత్‌పై జరిగిన 2017 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో జట్టును ఛాంపియన్‌గా నిలిపి చిరస్మరణీయ ఘనత సాధించింది. 2016 నుంచి 2025 వరకు 199 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించి 134 విజయాలు అందించింది. అయితే 2024-25 యాషెస్‌లో ఆస్ట్రేలియా చేతిలో 16-0 తేడాతో ఎదురైన ఘోర పరాజయం అనంతరం కెప్టెన్సీకి వీడ్కోలు పలికింది.


ఇవి కూడా చదవండి:

నాతో మర్యాదగా మాట్లాడండి.. రిఫరీతో మెస్సి వాగ్వాదం!

భారత్ వరుస ఓటములు.. కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు!

Updated Date - Jul 12 , 2026 | 12:41 PM