Share News

నాతో మర్యాదగా మాట్లాడండి.. రిఫరీతో మెస్సి వాగ్వాదం!

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:33 AM

ఫిఫా ప్రపంచ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రిఫరీ జీవో ఫెడ్రో పిన్‌హీరోతో ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి వాగ్వాదానికి దిగాడు.

నాతో మర్యాదగా మాట్లాడండి.. రిఫరీతో మెస్సి వాగ్వాదం!
Lionel Messi

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సెమీ ఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్‌లో స్విట్జర్లాండ్‌పై 1-3 తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రిఫరీ జీవో ఫెడ్రో పిన్‌హీరోతో ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి వాగ్వాదానికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


స్విట్జర్లాండ్ ఫ్రీ కిక్‌కు సిద్ధమవుతున్న సమయంలో అర్జెంటీనా ఆటగాళ్లు డిఫెన్సివ్ వాల్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మెస్సిని నిబంధనల ప్రకారం కొంత వెనక్కి వెళ్లాలని పోర్చుగల్‌కు చెందిన రిఫరీ జోవో పిన్‌హీరో సూచించారు. అయితే రిఫరీ మాట్లాడిన తీరు నచ్చకపోవడంతో మెస్సి అసహనం వ్యక్తం చేశాడు. ‘నాతో మర్యాదగా మాట్లాడండి. నన్ను అగౌరవపరచొద్దు. నేను మీతో గౌరవంగా మాట్లాడాను.. మీరు కూడా అలాగే మాట్లాడండి’ అంటూ మెస్సి రిఫరీకి స్పష్టంగా చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ ప్రపంచ కప్‌లో తొలిసారి గోల్ చేయలేకపోయిన మెస్సికి స్విస్ రక్షణ గోడగా నిలవడంతో అతడు అప్పటికే నిరాశలో ఉన్నాడు. ఆ సమయంలో జరిగిన ఈ ఘటనతో అతడి అసహనం మరింత బయటపడింది. అయితే అనంతరం అదనపు సమయంలో జూలియన్ అల్వారెజ్, లౌటారో మార్టినెజ్ గోల్స్‌తో అర్జెంటీనా 3-1తో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది.


ఎవరీ జోవో పిన్‌హీరో?

పోర్చుగల్‌లోని విలా నోవా డి ఫమలికావోకు చెందిన 38 ఏళ్ల జోవో పెడ్రో పిన్‌హీరో యూరప్‌లో ప్రతిభావంతమైన రిఫరీల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 2015లో పోర్చుగీస్ టాప్ డివిజన్‌లో రిఫరీగా అరంగేట్రం చేసిన ఆయన, ఏడాది వ్యవధిలోనే ఫిఫా అంతర్జాతీయ రిఫరీ హోదా సంపాదించారు. ఆ తర్వాత యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్, యూరోపా లీగ్, 2025 యూఈఎఫ్ఏ సూపర్ కప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో మ్యాచ్‌లను నిర్వహించిన పిన్‌హీరోకు, 2026 ఫిఫా ప్రపంచకప్‌లో మ్యాచ్ అధికారిగా అవకాశం లభించింది.


ఇవి కూడా చదవండి:

ఫిఫా ప్రపంచ కప్: సెమీస్‌కి దూసుకెళ్లిన అర్జెంటీనా.. వరుసగా రెండోసారి..

వైభవ్ సూర్యవంశీ ప్రతిభను నిర్లక్ష్యం చేయకండి.. మాజీ క్రికెటర్ల అసహనం

Updated Date - Jul 12 , 2026 | 11:48 AM