అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత
ABN , Publish Date - Jul 12 , 2026 | 02:31 PM
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఆంటోనియో ఉబాల్డో రాటిన్(89) కన్నుమూశారు. అర్జెంటీనా అత్యుత్తమ మిడ్ ఫీల్డర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన రాటిన్ మృతి పట్ల ఫుట్‌బాల్ ప్రపంచం సంతాపం వ్యక్తం చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఆంటోనియో ఉబాల్డో రాటిన్(89) కన్నుమూశారు. అర్జెంటీనా అత్యుత్తమ మిడ్ ఫీల్డర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన రాటిన్ మృతి పట్ల ఫుట్‌బాల్ ప్రపంచం సంతాపం వ్యక్తం చేస్తోంది. ఫిఫా ప్రపంచ కప్ 2026లో భాగంగా స్విట్జర్లాండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా ప్లేయర్లు నల్ల రిబ్బన్లు కట్టుకుని బరిలోకి దిగారు. మ్యాచ్‌కు ముందు అతడి మృతి పట్ల మౌనం పాటించారు. కాగా అతడి మృతిని బోకా జూనియర్స్ క్లబ్ ధ్రువీకరించింది.
‘మా సంస్థకు ప్రతీకగా నిలిచిన ఆంటోనియో ఉబాల్డో రాటిన్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు మా ప్రగాఢ సానుభూతి’ అంటూ బోకా జూనియర్స్ క్లబ్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. 1956 నుంచి 1970 వరకు బోకా జూనియర్స్ తరఫున ఆడిన రాటిన్.. ఆ క్లబ్‌కు వెన్నెముకగా నిలిచాడు. మొత్తం 382 మ్యాచ్‌లు ఆడి 28 గోల్స్ నమోదు చేశాడు. అతడి సారథ్యంలో బోకా నాలుగు అర్జెంటీనా లీగ్ టైటిళ్లు సాధించింది. 1963 కోపా లిబర్టడోర్స్ ఫైనల్‌కు బోకా చేరడంలోనూ రాటిన్ కీలక పాత్ర పోషించాడు.
ప్రపంచ కప్‌లో వివాదాస్పద ఘటన
అర్జెంటీనా జాతీయ జట్టుకు 1959 నుంచి 1969 వరకు రాటిన్ ప్రాతినిధ్యం వహించాడు. అయితే 1966 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఘటనతో అతడి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. ఆ మ్యాచ్‌లో జర్మనీ రిఫరీ రుడాల్ఫ్ క్రైట్లైన్.. రాటిన్‌కు రెడ్ కార్డు చూపించి మైదానం వీడాలని ఆదేశించాడు. అయితే తనకు స్పానిష్‌లో నిర్ణయం వివరించలేదని వాదిస్తూ రాటిన్ వెంటనే మైదానం నుంచి వెళ్లేందుకు నిరాకరించాడు. చివరకు బయటకు వెళ్తూ ఇంగ్లండ్ కార్నర్ ఫ్లాగ్‌ను కూల్చి, రాణి ఎలిజబెత్ కోసం ఏర్పాటు చేసిన ఎర్ర తివాచీపై కొద్దిసేపు కూర్చున్నాడు. ఈ సంఘటన 1966 ప్రపంచకప్‌లో అత్యంత చర్చనీయాంశమైన ఘట్టాల్లో ఒకటిగా నిలిచింది.
ఇవి కూడా చదవండి:
నాతో మర్యాదగా మాట్లాడండి.. రిఫరీతో మెస్సి వాగ్వాదం!
భారత్ వరుస ఓటములు.. కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు!