ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026: భారత్‌కు ఐదు స్వర్ణాలు
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:02 PM
అంతర్జాతీయ వేదికపై భారత విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. కొలంబియా వేదికగా జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో భారత్ ఐదు స్వర్ణాలు కైవసం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ వేదికపై భారత విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. కొలంబియా వేదికగా జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో భారత్ ఐదు స్వర్ణాలు కైవసం చేసుకుంది. దీంతో భారత్ సంయుక్తంగా ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుని చరిత్ర సృష్టించింది. జులై 4 నుంచి 12 వరకు జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో 87 దేశాల నుంచి 381 విద్యార్థులు పాల్గొన్నారు. భారత్ తరఫున పాల్గొన్న ఐదుగురు విద్యార్థులు.. ఐదు స్వర్ణాలు గెలుచుకోవడం దేశానికి అరుదైన ఘనతగా నిలిచింది.
పుణెకు చెందిన జైన్, ఇండోర్‌కు చెందిన రిద్దేశ్ అనంత్, ఢిల్లీకి చెందిన రిషిత్ గార్గ్, ముంబైకి చెందిన శ్రేష్ఠ్ సుర్యా, అహ్మదాబాద్‌కు చెందిన జోషి స్వర్ణాలు గెలుచుకున్నారు. ఈ పోటీల్లో భారత జట్టుకు టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్) పరిధిలోని హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (హెచ్‌బీసీఎస్‌ఈ) శిక్షణ, మార్గదర్శకత్వం అందించింది. అణుశక్తి శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ జాతీయ సైన్స్ ఒలింపియాడ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దుతోంది. ఈ విజయంతో భారత విద్యార్థుల శాస్త్రీయ ప్రతిభ మరోసారి ప్రపంచానికి చాటినట్లు అయిందని అధికారులు పేర్కొన్నారు. భౌతికశాస్త్రంపై మరింత మంది విద్యార్థుల్లో ఆసక్తి పెరగడంతో పాటు, భవిష్యత్తులో అంతర్జాతీయ ఒలింపియాడ్‌లలో పాల్గొనేందుకు ఈ విజయం స్ఫూర్తినిస్తుందని అభిప్రాయపడ్డారు.
అసలేంటీ ఫిజిక్స్ ఒలింపియాడ్?
అంతర్జాతీయ భౌతికశాస్త్ర ఒలింపియాడ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులను ఒకచోట చేర్చే వార్షిక పోటీ. ఇందులో పాల్గొనేవారి ఫిజిక్స్‌పై అవగాహన, విశ్లేషణాత్మక ఆలోచనా విధానం, సమస్యల పరిష్కార నైపుణ్యాలను అంచనా వేసే ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహిస్తారు. ఒలింపియాడ్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ముందు విద్యార్థులు నెలల తరబడి శిక్షణ పొందుతారు. ఏళ్లుగా అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్‌లో భారత్ నిలకడగా రాణిస్తోంది. ఈ ఏడాది ఫలితం దేశ రికార్డుకు మరో మైలురాయిని చేర్చింది.
ఇవి కూడా చదవండి:
ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్?
వింబుల్డన్‌లో మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్