Share News

ఒత్తిడికి బీసీసీఐ ప్రభావితం కావొద్దు.. వైభవ్ ఎంపికపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 13 , 2026 | 04:27 PM

భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అంతర్జాతీయ అరంగేట్రం కల్పించిన తీరు సరైనదేనా? బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్ సోషల్ మీడియా ఒత్తిడికి తలొగ్గాయా? అంటూ మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశ్నించాడు.

ఒత్తిడికి బీసీసీఐ ప్రభావితం కావొద్దు.. వైభవ్ ఎంపికపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Ravichandran Ashwin

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అంతర్జాతీయ అరంగేట్రం కల్పించిన తీరు సరైనదేనా? బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్ సోషల్ మీడియా ఒత్తిడికి తలొగ్గాయా? అంటూ మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశ్నించాడు. 15 ఏళ్ల వైభవ్ ప్రతిభపై ప్రశంసలు కురిపించిన అశ్విన్.. అతడికి మరింత సమయం ఇచ్చి ఆ తర్వాత జట్టులోకి తీసుకుని రావాల్సిందంటూ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వైభవ్‌కు భారత జట్టులో అరంగేట్రం చేసే అవకాశం లభించిన సంగతి తెలిసిందే. అయితే మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి చివరి టీ20కు మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. వైభవ్‌ను వెంటనే తుది జట్టులోకి తీసుకోవాలని సోషల్ మీడియాలో అభిమానులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు కూడా బలంగా డిమాండ్ చేశారు. ఇదే అంశంపై తన యూట్యూబ్ ఛానల్‌లో అశ్విన్ స్పందించాడు.


‘వైభవ్ అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాడు. నేను సెలెక్టర్ అయితే అతడిని ఎంపిక చేసేవాడినే. కానీ అతడికి కాస్త సమయం ఇవ్వాలి. ఇదంతా ఒక ఇంటర్న్‌షిప్‌లా భావించాలి. కొన్నిసార్లు నేను కూడా ఈ కాలంలో ఆడి ఉంటే బాగుండేదనిపిస్తుంది. నేను టెస్టు పర్యటనకు వెళ్లినప్పుడు కూడా సోషల్ మీడియాలో అశ్విన్ తప్పక ఆడాలని చాలా మంది కోరేవారు. 'అతడిని ఎలా తప్పిస్తారు?' అని ప్రశ్నించేవారు. కానీ నేను జట్టులో ఆడలేదు. ఎందుకంటే జట్టుకు ఏం అవసరమో టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలుసు. ఇప్పుడు సోషల్ మీడియా ఒత్తిడికి తలొగ్గి జట్టును ఎంపిక చేయాలా?’ అంటూ అశ్విన్ ప్రశ్నించాడు.


జట్టు నిర్ణయమే అంతిమం..

ఇంగ్లండ్ పర్యటనలో మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ తాను తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సందర్భాన్ని కూడా అశ్విన్ గుర్తు చేశాడు. ‘నేను ఆడాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని నిర్ణయాలు 50-50గా ఉండేవి. మరికొన్ని సందర్భాల్లో జట్టు ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయాలే సరైనవని తర్వాత అర్థమైంది. ఇంగ్లండ్‌కు అద్భుతమైన ఫామ్‌తో వెళ్లినా కోచ్, కెప్టెన్ నాతో మాట్లాడి జట్టు కాంబినేషన్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తర్వాత వారి ఆలోచనను నేను అర్థం చేసుకున్నాను. ఎప్పుడైనా జట్టు నిర్ణయమే అంతిమం. టీమ్ మేనేజ్‌మెంట్ ఒక దేవాలయం లాంటిది. బయట నుంచి వచ్చే ఒత్తిడి జట్టు నిర్ణయాలను ప్రభావితం చేయకూడదు. ఒకవేళ సోషల్ మీడియా ఒత్తిడి బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్‌ను ప్రభావితం చేస్తే.. ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

సీఎస్కేకి కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్‌బై.. 18 ఏళ్ల ప్రయాణానికి తెర

ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026: భారత్‌కు ఐదు స్వర్ణాలు

Updated Date - Jul 13 , 2026 | 04:27 PM