వింబుల్డన్ ‘టవల్’ లెవలే వేరు!
ABN , Publish Date - Aug 02 , 2026 | 08:25 AM
వింబుల్డన్’ టెన్నిస్ టోర్నమెంట్... ఎన్నో ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ప్రత్యక్షంగా, పరోక్షంగా... కుర్చీలకు అతుక్కుపోయేలా చేస్తున్న వేదిక.
‘వింబుల్డన్’ టెన్నిస్ టోర్నమెంట్... ఎన్నో ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ప్రత్యక్షంగా, పరోక్షంగా... కుర్చీలకు అతుక్కుపోయేలా చేస్తున్న వేదిక. ఆటగాళ్లు బ్రహ్మాండమైన షాట్ కొట్టిన తర్వాత, లేదంటే గెలుపోటముల తర్వాత... అక్కడే కుర్చీపై వేసిన టవల్‌తో చెమట తుడుచుకోవడం చూస్తుంటాం. టెన్నిస్ బంతులకే కాదు... ఈ వింబుల్డన్ టవల్స్‌కు ఉండే క్రేజ్ కూడా మామూలుగా ఉండదు. అయితే అంతటి ప్రతిష్టాత్మకమైన టవల్స్ మన దగ్గరే తయారవుతాయని తెలుసా? అలాగే ఆ టవల్స్ చుట్టూ అల్లుకున్న కథలు వింటే ఆశ్చర్యపోతాం.
టెన్నిస్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ‘వింబుల్డన్’. ప్రతీ ఏటా లండన్‌లో జరిగే ఈ టోర్నమెంట్‌లో ప్రపంచంలోని అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారులు పాల్గొనడం గౌరవంగా భావిస్తారు. ఆద్యంతం ఉత్కంఠను పంచే ఈ ఆటలో వీక్షకులను బాగా ఆకర్షించేవి ఆటగాళ్లు ఉపయోగించే టవల్స్. వాటి ప్రత్యేకత అలాంటిది. ‘ఒక్క వింబుల్డన్ టవల్ దొరికితే బాగుండు’ అని మనసులో అనుకోకుండా ఉండలేరు టెన్నిస్ అభిమానులు.
గుజరాత్‌లో తయారీ...
ఒకప్పుడు వింబుల్డన్ టోర్నమెంట్ కోసం టవల్స్ ఇంగ్లాండ్‌లోనే తయారయ్యేవి. మాంచెస్టర్‌లోని ‘క్రిస్టీ’ అనే సంస్థ తయారుచేసేది. అయితే ఇప్పుడు మాత్రం గుజరాత్‌లోని వాపి, అంజార్ పట్టణాల్లో తయారవుతున్నాయి. ‘క్రిస్ట్టీ’ చరిత్ర చాలా పాతది. ఈ సంస్థ 1850లో ప్రారంభమైంది. మొదట ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో ఒక పత్తిమిల్లులో ప్రపంచంలోనే అత్యంత మృదువైన బాత్ టవల్స్‌ను ఆ సంస్థ తయారు చేసింది. మొదటి టవల్‌ను ఇంగ్లాండ్ రాణి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. అప్పటి నుంచి ‘క్రిస్ట్టీ’ బ్రాండ్ నాణ్యతకు ప్రతీకగా నిలిచింది. టవల్స్ నాణ్యత బాగుండటంతో వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లకు టవల్స్ సరఫరా చేసే బాధ్యతలను అప్పగించారు.
1987 నుంచి 2006 వరకు వింబుల్డన్ అధికారిక టవల్స్ అన్నీ ఆ సంస్థనే అందించేది. అయితే 2006లో మనదేశానికి చెందిన ప్రముఖ టెక్స్‌టైల్స్ కంపెనీ ‘వెల్‌స్పన్’, క్రిస్టీ బ్రాండ్‌ను సొంతం చేసుకుంది. ఆ తరువాత గుజరాత్‌లోని వాపి, అంజార్ నగరాల్లో ఉన్న పరిశ్రమల్లో టవల్స్ తయారీని ప్రారంభించింది. వింబుల్డన్ టవల్స్ తయారీ బాధ్యత మనకు దక్కడం... భారతీయ వస్త్ర పరిశ్రమకు గర్వకారణమని అంటారు విశ్లేషకులు.
టెన్నిస్ ఆటగాళ్ల చేతుల్లో కనిపించే ఈ టవల్స్ తయారీ వెనక ఎంతో శ్రమ దాగుంది. టవల్స్ నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడకుండా తయారుచేస్తారు. పర్యావరణహితంగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆ టవల్స్ ప్రశంసలు అందుకుంటున్నాయి.
ఏమిటీ వీటి ప్రత్యేకం?
వింబుల్డన్‌లో ఉపయోగించే టవల్స్ సాధారణమైనవి కావు. వాటి తయారీ వెనక నెలల తరబడి ప్రణాళిక, అత్యాధునిక సాంకేతికత, నిపుణుల కృషి దాగుంది. ప్రత్యేకమైన ‘షార్ట్ లూప్ టెర్రీ వీవ్’ టెక్నాలజీతో వాటిని తయారు చేస్తారు. హైగ్రో కాటన్ సాంకేతికత ను ఉపయోగిస్తారు. అత్యుత్తమ నాణ్యతగల 500 జీఎస్‌ఎమ్ 100 పర్సెంట్ కాంబ్డ్ పత్తిని ఉపయోగిస్తారు. అందుకే టవల్స్ అత్యంత మృదువుగా ఉంటాయి. చెమటను తక్షణమే పీల్చేస్తాయి. త్వరగా ఆరిపోతాయి. ఎక్కువకాలం మన్నుతాయి. ప్రతీ ఏడాది టోర్నమెంట్ ప్రారంభానికి దాదాపు 18 నెలల ముందే టవల్ డిజైన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఏటా అధికారిక టవల్ డిజైన్‌ను మాంచెస్టర్‌లోని క్రిస్టీ డిజైన్ స్టూడియో రూపొందిస్తుంది. డిజైన్ బృందం కేవలం రంగులు మాత్రమే కాదు... ఆ ఏడాది ఫ్యాషన్ ట్రెండ్స్, సీజనల్ కలర్ థీమ్స్, కొత్త డిజైన్స్‌ను పరిశీలించిన తర్వాతే డిజైన్‌ను ఖరారు చేస్తుంది. ప్రతీ ఏడాది వింబుల్డన్ రంగుల థీమ్‌కు అనుగుణంగా డిజైన్ చేస్తారు. పురుషుల టవల్స్ సంప్రదాయ ఆకుపచ్చ, ఊదా, బంగారు రంగుల్లో ఉంటాయి. మహిళా టెన్నిస్ క్రీడాకారులు ఉపయోగించే టవల్స్ ప్రతీ ఏడాది కొత్త రంగులు, కొత్త డిజైన్లతో విడుదల చేస్తారు. 2026లో విడుదలైన టవల్ ఎరుపు- తెలుపు రంగుల్లో ఉండటంతో అభిమానులు ‘స్ట్రాబెర్రీ టవల్’ అని పేరు పెట్టారు. సాధారణంగా టవల్ తయారీ పూర్తయ్యాక రంగులను ముద్రిస్తారు.
కానీ ఇక్కడ అలా కాదు. రంగు దారాలతోనే టవల్ నేస్తారు. దీనివల్ల రెండు వైపులా ఒకే అందమైన డిజైన్ కనిపిస్తుంది. ఒక దారం పోగు లాగినా మొత్తం డిజైన్ చెడిపోదు. ఈ టవల్స్ తడిని త్వరగా పీల్చుకుంటాయి. ఆటగాళ్లు ఈ టవల్స్‌తో ఒక్కసారి తుడుచుకుంటే చాలు... చెమట మొత్తం తొలగిపోతుంది. ఒక్కో టవల్ తయారవడానికి సుమారు వారం రోజుల సమయం పడుతుంది. ‘‘ఇన్నేళ్లుగా వింబుల్డన్‌తో మా భాగస్వామ్యం కొనసాగడం మాకు లభించిన గౌరవం. వింబుల్డన్ టవల్స్ కేవలం టవల్స్ మాత్రమే కాదు. అవి టెన్నిస్ అభిమానులకు కలెక్షన్ ఐటమ్స్‌గా మారాయి.
నాణ్యమైన, పర్యావరణహితంగా తయారవుతున్న ఈ టవల్స్ తయారీ ఒకరకంగా మాకు గర్వకారణం. 75 ఏళ్ల బ్రిటిష్ వారసత్వాన్ని వెల్‌స్పన్ తన అత్యాధునిక సాంకేతికత, భారీ ఉత్పత్తి సామర్థ్యం, భారతీయ నైపుణ్యంతో వరల్డ్ ఐకానిక్‌గా మారుస్తోంది. భారతీయ టెక్స్‌టైల్ పరిశ్రమ ప్రపంచ స్థాయి ప్రమాణాలను ఎంత సులభంగా అందుకోగలదో వాపీ నిరూపించింది’’ అని అంటారు క్రిస్టీ వెల్‌స్పన్ సీఈఓ వన్షికా గోయెంకా. ప్రతీ ఏడాది సుమారు 50 వేల టవల్స్... వింబుల్డన్ ఛాంపియన్‌షిప్, అధికారిక రిటైల్ విక్రయాల కోసం తయారు చేస్తున్నారు.
ఆప్తులకు ఇవ్వడానికి...
ప్రతీ ఆటగాడికి మ్యాచ్‌లు ఆడే సమయంలో, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉపయోగించడానికి టవల్స్ ఇస్తారు. టోర్నమెంట్ ముగిసిన తర్వాత వాటిని తిరిగి ఇవ్వాలి. కానీ చాలామంది ఆటగాళ్లు తిరిగి ఇవ్వడం లేదు. ఏటా వింబుల్డన్ టోర్నమెంట్ కోసం సుమారు 2500 టవల్స్ తెప్పిస్తుంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... వీటిలో కేవలం 15 శాతం మాత్రమే తిరిగి నిర్వాహకుల చేతికి చేరుతున్నాయి. కొంతమంది ఆటగాళ్లు వాటిని జ్ఞాపకంగా దాచుకుంటే... మరికొందరు స్నేహితుల కోసం తీసుకెళుతున్నారు. ఇంకొంతమంది ఆటగాళ్లు గెలిచిన ఆనందంతో ప్రేక్షకుల వైపు వాటిని విసిరేస్తారు. ఆ టవల్ దొరికితే అభిమానులు దానిని జీవితాంతం ఒక అమూల్యమైన జ్ఞాపకంగా దాచుకుంటారు.
‘‘వింబుల్డన్ ముగిసిన తర్వాత కూడా ఆటగాళ్లు, అభిమానులు ఈ టవల్‌ను ఎంతో ప్రేమగా భద్రపరుచుకుంటారు. రోజర్ ఫెదరర్, నోవాక్ జొకోవిచ్, ఇగా స్వియాటెక్ వంటి టెన్నిస్ దిగ్గజాలు వారి కోసం, కుటుంబ సభ్యుల కోసం ఈ టవల్స్‌ను ఇంటికి తీసుకెళ్తామని చెప్పడం మాకు ఎంతో ఆనందాన్నిస్తుంది’’ అంటారు గోయెంకా. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆటగాళ్లు టవల్స్ బ్యాగ్‌లో పెట్టుకుంటే ప్రేక్షకులు ‘‘టవల్ ఇవ్వండి!’’ అంటూ గట్టిగా అరుస్తుంటారు. వింబుల్డన్ టవల్ ధర సుమారు రూ. 5వేలకు పైనే ఉంటుంది.
ఆటగాళ్ల నుంచి నేరుగా టవల్ పొందడం అభిమానులు అదృష్టంగా భావిస్తారు. ప్రతీ ఆటగాడికి మ్యాచ్ ప్రారంభంలో 4 టవల్స్ అందిస్తారు. వర్షం వల్ల ఆట ఆగితే మరో టవల్‌ను ఇస్తారు. అలాగే క్రిస్టీ సంస్థ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ‘హెయిర్‌లూమ్’ కలెక్షన్‌ను రూపొందించింది. ఇందులో భాగంగా గత వింబుల్డన్‌లో మిగిలిపోయిన టవల్స్‌ను వృథా చేయకుండా టోట్ బ్యాగులు, బాత్ రోబులు, కాస్మెటిక్ పౌచ్‌ల వంటి ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. గత ఏడాది అలా తయారుచేసిన టోట్ బ్యాగులు క్షణాల్లో అమ్ముడయ్యాయి. వింబుల్డన్ టవల్స్‌కున్న క్రేజ్ అలాంటిది మరి.
టవల్స్ దొంగ...
వింబుల్డన్ స్టార్ పోలండ్ టెన్నిస్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ ఒక మ్యాచ్ తర్వాత టవల్స్‌ను తన బ్యాగ్‌లో పెట్టుకుంటూ కెమెరాకు చిక్కింది. అలా ఒక్కసారి కాదు... చాలాసార్లు జరగడంతో అభిమానులు ఆమెకు సరదాగా ‘వింబుల్డన్ టవల్ థీఫ్’ అనే పేరు పెట్టారు. ‘‘ప్రతీ గ్రాండ్‌స్లామ్ ముగిసిన తర్వాత నా స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ టవల్స్ కావాలని అడుగుతుంటారు. అందుకే తీసుకెళ్తాను. సారీ వింబుల్డన్... ఇలా చేయకూడదేమో కానీ స్నేహితుల కోసం తప్పడం లేదు’’ అంటారు స్వియాటెక్.
‘‘కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం టవల్స్ తీసుకెళ్లడానికి మరో బ్యాగ్ తీసుకురావాల్సి వస్తోంది’’ అని టెన్నిస్ దిగ్గజం జొకోవిచ్ సరదాగా వ్యాఖ్యానించడాన్ని బట్టి ఈ టవల్స్‌కున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి:
45 నిమిషాల్లో 5 ప్లేట్ల బిర్యానీ తిన్నాడు.. భారీ బహుమతి గెలిచాడు..
సికింద్రాబాద్‌లో లష్కర్ బోనాల సందడి.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం
Read Latest AP News And Telangana News And International News And Telugu News