‘అంతర్జాతీయ’ లోటు తీరేలా!
ABN , Publish Date - Aug 02 , 2026 | 07:42 AM
ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం... రూ.5,000 కోట్ల వ్యయం... అతి తక్కువ సమయంలో నిర్మాణం... ఆధునిక హంగులు, అందమైన సొబగులు... అదే భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం.
విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం... రూ.5,000 కోట్ల వ్యయం... అతి తక్కువ సమయంలో నిర్మాణం... ఆధునిక హంగులు, అందమైన సొబగులు... అదే భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఆంధ్రప్రదేశ్‌లో మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నా ఏవీ ప్రజల అవసరాలు తీర్చలేకపోతున్నాయి. విశాఖ విమానాశ్రయం పూర్తిగా నేవీ ఆధీనంలో ఉంది. విజయవాడ విమానాశ్రయం ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. తిరుపతి విమానాశ్రయం నుంచి విదేశీ సర్వీసులు లేవు. ఇతర విమానాశ్రయాలన్నీ బాగా చిన్నవి. అందుకే భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు అంత ప్రాధాన్యం ఇచ్చారు. తూర్పు తీరానికి ఇది గేట్‌వేలా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. పట్టుబట్టి నిర్దేశిత గడువుకంటే ఐదు నెలలు ముందుగానే జీఎంఆర్‌తో నిర్మాణం పూర్తి చేయించింది. ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం నుంచి ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థలు అంతర్జాతీయ సర్వీసులు నడపనున్నాయి.