సమన్వయంతో సక్సెస్
ABN , Publish Date - Aug 02 , 2026 | 07:53 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతమైంది. ప్రభుత్వం సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంతరాలు లేకుండా ఘనంగా నిర్వహించింది.
సమన్వయంతో సక్సెస్
సీఎం, మంత్రులు, అధికారుల సమీక్షలు
ప్రశాంతంగా భోగాపురం ప్రారంభోత్సవం
భోగాపురం, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతమైంది. ప్రభుత్వం సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంతరాలు లేకుండా ఘనంగా నిర్వహించింది. సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు.. అధికారులతో నిత్యం సమీక్షలు చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు నిత్య పర్యవేక్షణతో పాటు మంత్రి లోకేశ్ నేతృత్వంలోని 11 మంది మంత్రుల బృందం వారం రోజులుగా ఇక్కడే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా ఎమ్మెల్యేలు నిత్యం ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర, విజయనగరం జిల్లా ప్రభుత్వ యంత్రాంగాలు, ఉత్తరాంధ్రలోని జిల్లాల యంత్రాంగాలు సమన్వయంతో వ్యవహరించాయి. సభ నిర్వహణ, పారిశుధ్యం, తాగునీరు, భోజన వసతులు, అతిథులకు స్వాగతం, భద్రత, వాహనాల పార్కింగ్, దారి మళ్లింపు ఇలా ప్రతి అంశాన్ని సమన్వయం చేసుకోవడంతో ఎటువంటి అసౌకర్యాలు లేకుండా కార్యక్రమం సజావుగా జరిగింది.
రుచికరమైన అక్షయపాత్ర భోజనాలు..
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన అశేష జనవాహినికి రుచికరమైన భోజనం అందించారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం బోయపాలెం గంభీరంలోని అక్షయపాత్ర ఫౌండేషన్ నుంచి మధ్యాహ్న భోజనాలు సమకూర్చారు. ఇంటి వంటలా.. అత్యంత శుచి, రుచికరమైన విందులాంటి వంటకాలను అడిగి మరీ కొసరి కొసరి వడ్డించారు. 81 వేల మందికి పైగా భోజనాలను సమకూర్చారు. ఈ భోజనాన్ని తిన్నవారు ఇంటి భోజనం వలే ఉందంటూ కితాబునిచ్చారు. జిల్లా పౌరసరఫరాల అధికారి పర్యవేక్షణలో అక్షయ పాత్ర ప్రతినిధులు భోజనాలు అందచేశారు.
భూములిచ్చిన రైతులకు వీఐపీ గ్యాలరీ..
భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది. విమానాశ్రయం ప్రారంభ వేడుకలో వారికి వీఐపీ గ్యాలరీలో స్థానం ఇచ్చి ప్రత్యేకంగా కూర్చోబెట్టింది. దీంతో ఆ రైతులంతా హర్షం వ్యక్తం చేశారు. తమను గుర్తించి ప్రభుత్వం ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
పోలీసుల సేవలు భేష్..
ప్రధాని పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, విశాఖ రేంజ్ డీఐజీ, ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్పీల నేతృత్వంలో 7 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు.