Share News

ఉత్తరాంధ్ర.. ఇకపై ఉత్తమాంధ్ర!

ABN , Publish Date - Aug 02 , 2026 | 07:55 AM

ఉత్తరాంధ్ర ఇకపై అభివృద్ధిలో ఉత్తమాంధ్రగా నిలువబోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఈ ప్రాంతం దశ-దిశ మారబోతున్నాయన్నారు.

ఉత్తరాంధ్ర.. ఇకపై ఉత్తమాంధ్ర!
Chandrababu: Bhogapuram Airport Will Transform North Andhra into ‘Uttama Andhra’

  • భోగాపురం విమానాశ్రయంతో కొత్త దిశ-దశ: సీఎం

  • ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు అందించిన ఘనత కూటమిదే

  • ఎర్ర బస్సే రాదన్న చోట ఎయిర్‌బస్‌ వచ్చేలా చేశాం

  • అవహేళన చేసినవారు అడ్రస్‌ లేకుండా పోయారు

  • నాడు కొబ్బరికాయ కొట్టాం.. నేడు గుమ్మడికాయ కట్టాం

  • రాష్ట్ర పునర్నిర్మాణానికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం

  • ఉత్తరాంధ్రలో 8 ప్రాధాన్య సాగు ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

  • రెండేళ్లలో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు రూ.6.13 లక్షల కోట్ల పెట్టుబడులు

  • వీటితో 5.57 లక్షల ఉద్యోగాలు.. ఉత్తరాంధ్రకే వలసొచ్చే రోజులొచ్చాయ్‌: సీఎం

భోగాపురం,(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఇకపై అభివృద్ధిలో ఉత్తమాంధ్రగా నిలువబోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఈ ప్రాంతం దశ-దిశ మారబోతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందన్నారు. ‘ఎర్రబస్సే రాదన్నారు.. ఏకంగా ఎయిర్‌బస్సే వచ్చింది. అవహేళన చేసినవాళ్లు.. అభివృద్ధిని అడ్డుకున్న వాళ్లు అడ్రస్‌ లేకుండా పోయారు’ అన్నారు. శనివారం భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో సీఎం మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

భూములిచ్చిన రైతులకు పాదాభివందనం..

భోగాపురం విమానాశ్రయం కోసం భూములిచ్చిన రైతులే ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. వారందరికీ పాదాభివందనం చేస్తున్నా. రెండేళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని చూశాం. నరేంద్ర మోదీ నాయకత్వంలో నేను, పవన్‌ కల్యాణ్‌ విధ్వంస రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తూ మాట నిలబెట్టుకుంటున్నాం. ఈ ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకే గర్వకారణంగా నిలవనుంది. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును విమానాశ్రయానికి పెట్టడం సముచితం. ఆయన పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. ఉత్తరాంధ్రవాసి గ్రంధి మల్లికార్జునరావు (జీఎంఆర్‌) ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ప్రాజెక్టుకు తొలి అడుగు వేసిన అశోక్‌ గజపతిరాజు ఇక్కడి వారే. నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్‌నాయుడు కూడా ఇక్కడివారే. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర సత్తాను ప్రపంచానికి చాటనుంది. విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్‌ కారిడార్‌ నిర్మిస్తున్నాం. శంషాబాద్‌ విమానాశ్రయం తెలంగాణ రూపురేఖలు మార్చినట్లే భోగాపురం... ఉత్తరాంధ్ర దశను మార్చనుంది.

ఉత్తరాంధ్రకే వలసలొచ్చే రోజులొచ్చాయ్‌..

కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్‌ ఇచ్చిన వ్యక్తి ప్రధాని మోదీ. పోలవరం, విశాఖ రైల్వే జోన్‌, విశాఖ ఉక్కును కాపాడిన వ్యక్తి మోదీ. రాజధానికి నిధులు ఇచ్చి పనులు పునఃప్రారంభించి, అండగా నిలబడిన వ్యక్తి మోదీ. ఆయన సహకారంతో రెండేళ్లలో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు రూ.6.13 లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించాం. వీటి ద్వారా 5.57 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. గూగుల్‌, స్టీల్‌ కంపెనీలతోపాటు చాలా కంపెనీలు వచ్చాయి. రానున్న మూడేళ్లలో రూ.2784 కోట్లతో ఈ ప్రాంతంలో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. 65 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నేరడి బ్యారేజీకి అనుమతులు వచ్చాయి. దానికి నిధులు కేటాయించాం. ఈ నెలలో గోదావరి నీటిని అనకాపల్లికి తీసుకొస్తాం. వంశధార-గోదావరి నదుల అనుసంధానం చేస్తాం. ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, జాతీయ రహదారులు, రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌, పుణ్యక్షేత్రాలు వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఉపాధి కోసం ఉత్తరాంధ్ర నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే పరిస్థితి తగ్గుతుంది. భవిష్యత్‌లో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికే వలస వచ్చే రోజులు వస్తాయి.

మోదీలాంటి నేతను చూడలేదు...

ప్రపంచం ఐటీ నుంచి ఏఐ వైపు వెళ్తోంది. ఈ దశలో వివిధ దేశాలు సరైన నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ భారతదేశం అదృష్టం. ప్రధాని మోదీ వంటి సమర్థ నాయకుడు లభించారు. 144 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగేది ఒక్క మోదీనే. ప్రధానిగా 12 ఏళ్లుగా దేశాన్ని సమర్థంగా నడిపిస్తున్నారు. పరిపాలనలో అవినీతి ఆరోపణలు లేకుండా ముందుకెళ్తున్నారు. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు నిర్మిస్తున్నారు. ఈ దేశాన్ని డిజిటల్‌ ఇండియాగా మార్చిన ఘనత మోదీకి దక్కుతుంది. సోలార్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ను ప్రోత్సహించి వాటి ద్వారా కాలుష్యం తగ్గిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే నాలుగో స్థానంలోకి తెచ్చారు. తీవ్రవాదం, నక్సలిజం లేకుండా అరికట్టారు. మోదీ సారథ్యంలో 2047లోగా ప్రపంచంలో భారత్‌ నంబర్‌వన్‌గా నిలుస్తుంది. రైట్‌ టైమ్‌.. రైట్‌ ప్లేస్‌లో రైట్‌ మ్యాన్‌గా మోదీ ఉన్నారు. ఆయనకు అందరూ అండగా నిలవాలి. అది మన బాధ్యత.

ప్రధాని చేతుల మీదుగానే పోలవరం, అమరావతి

ప్రధాని మోదీ నాయకత్వంలో 2015లో భోగాపురం విమానాశ్రయాన్ని ప్రకటించాం. అనుమతులు తెచ్చి, 2019లో శంకుస్థాపన చేశాం. నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే. నేడు గుమ్మడి కాయ కట్టిందీ మనమే. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తాం. 2028 నాటికి రాజధాని అమరావతి మొదటి దశ పూర్తి చేసి దానిని కూడా ఆయన చేతుల మీదుగానే ప్రారంభిస్తాం.

Updated Date - Aug 02 , 2026 | 08:30 AM