టీ20 ప్రపంచ కప్ 2026: భారత్-పాక్ వివాదం.. కరాచీ చేరుకున్న బీసీబీ ఛైర్మన్!
ABN , Publish Date - Feb 08 , 2026 | 03:45 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్-పాక్ వివాదం మరో మలుపు తిరిగింది. భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ అమిన్ ఉల్ ఇస్లామ్ కరాచీ చేరుకుని పీసీబీ ఛైర్మన్ నఖ్వీని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్-పాక్ వివాదానికి ఇంకా తెరపడలేదు. శ్రీలంక వేదికగా భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌ను ఈ టోర్నీ నుంచి ఐసీసీ తప్పించడంతో దానికి మద్దతుగా పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పాక్‌ను దారికి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఐసీసీ, పీసీబీ మధ్య వర్చువల్ సమావేశం జరగనుంది. ఈ క్రమంలో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ అమిన్ ఉల్ ఇస్లామ్ కరాచీ చేరుకుని పీసీబీ ఛైర్మన్ నఖ్వీని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన కూడా ఐసీసీ, పీసీబీ వర్చువల్ మీటింగ్‌లో భాగం కానున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయంపై శ్రీలంక క్రికెట్ బోర్డు.. పీసీబీ(PCB)కి లేఖ రాసిన విషయం తెలిసిందే. తమ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని శ్రీలంక కోరింది. ఈ పరిణామం తర్వాత పాక్ వైఖరిలో కాస్త మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధం వంటి అనూహ్య పరిస్థితుల్లో ఉపయోగించే ‘ఫోర్స్ మెజ్యూర్’ నిబంధన ప్రకారం తమకు మినహాయింపు ఇవ్వాలని పాక్ ఐసీసీని కోరినట్లు సమాచారం. అయితే విపత్కర పరిస్థితులు లేకుండానే ఆ నిబంధనను సాకుగా చూపి పాక్ తప్పించుకోవాలని ఐసీసీ(ICC) గ్రహించి.. పీసీబీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సరైన కారణాలు చూపలేకపోతే కఠిన చర్యలకు సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో పాక్.. భారత్(India vs Pakistan)తో మ్యాచ్ ఆడే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఐసీసీ డైరెక్టర్ ఒకరు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్-పాక్ తలపడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ 2026: అభిషేక్‌కు అనారోగ్యం.. ఆ స్టార్ ఆల్‌రౌండర్ రీఎంట్రీ!
టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. కోహ్లీ రికార్డు బద్దలు