ఎవరి సత్తా ఎంత?
ABN , Publish Date - Feb 08 , 2026 | 02:15 PM
20 జట్లతో అట్టహాసంగా ఆరంభమైన టీ20 వరల్డ్‌కప్‌లో అభిమానుల దృష్టి మాత్రం కొందరిపైనే ఉండనుంది. అసలైన పోటీ కూడా ప్రధాన జట్ల మధ్యే సాగనుంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగబోతున్న భారత్ మూడోసారి టైటిల్ పట్టేయాలని భావిస్తోంది.
20 జట్లతో అట్టహాసంగా ఆరంభమైన టీ20 వరల్డ్‌కప్‌లో అభిమానుల దృష్టి మాత్రం కొందరిపైనే ఉండనుంది. అసలైన పోటీ కూడా ప్రధాన జట్ల మధ్యే సాగనుంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగబోతున్న భారత్ మూడోసారి టైటిల్ పట్టేయాలని భావిస్తోంది. మరోవైపు ఆతిథ్య జట్టు కలను భగ్నం చేసి తమదే పైచేయి అని చాటుకునేందుకు ప్రధాన జట్లు సై అంటూ సవాల్ విసరబోతున్నాయి. అటు స్కాట్లాండ్, యూఎస్‌ఏ, నేపాల్, యూఏఈ, ఒమన్, నెదర్లాండ్స్, ఇటలీ, జింబాబ్వే, నమీబియా నామమాత్రంగానైనా తమ ఉనికి చాటుకోవాలనుకుంటున్నాయి. శ్రీలంక, అఫ్ఘాన్, వెస్టిండీస్, ఐర్లాండ్‌లను కూడా తక్కువ అంచనా వేయలేం. అయితే టీమిండియాతో పాటు దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను ఫేవరెట్లుగా భావించవచ్చు. ఓసారి ఈ జట్ల బలాబలాలను పరిశీలిస్తే...
ఆస్ట్రేలియా: చివరి వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగుపెట్టిన ఆసీస్ సూపర్-8 దశలోనే వెనుదిరిగింది. తాజాగా మరోసారి కెప్టెన్ మిచెల్ మార్ష్ నేతృత్వంలో బరిలో నిలిచింది. అనుభవజ్ఞులు ట్రావిస్ హెడ్, మార్ష్, మ్యాక్స్‌వెల్, కమిన్స్ జట్టుకు అండగా ఉండనున్నారు. అలాగే ఆరుగురు ఆల్‌రౌండర్లు ఉండడంతో తుది జట్టు ఎంపికలో వెసులుబాటు లభిస్తుంది. ఇక భారత ఉపఖండంలో మ్యాచ్‌లు జరుగుతున్నాయి కాబట్టి ముగ్గురు స్పిన్నర్లను ఎంపిక చేశారు. అయితే పేసర్లు కమిన్స్, హాజెల్‌వుడ్ పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోవడం కాస్త కంగారు పెట్టే అంశం.

ఇంగ్లండ్: 2010, 2022లలో చాంపియన్‌గా నిలిచిన ఇంగ్లండ్ మూడో కప్‌తో చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. మెగా టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టు యువ, అనుభవజ్ఞులతో సమతూకంగా కనిపిస్తోంది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్‌ల ఊచకోత ఐపీఎల్ అభిమానులకు తెలిసిందే. పైగా భారత పిచ్‌లు వారికి కొట్టిన పిండి. డకెట్ రూపంలో వీరికి మరో ఓపెనింగ్ ఆప్షన్ కూడా ఉంది. గ్రూప్ మ్యాచ్‌లను ముంబై, కోల్‌కతాలో ఆడనుండగా అక్కడి పిచ్‌లు స్ట్రోక్‌ప్లేకు అనుకూలంగా ఉండడం వీరికి కలిసిరావచ్చు. అలాగే వరల్డ్‌క్లాస్ పేసర్ లేకపోవడం లోటుగా ఉంది. ఆర్చర్ ఫిట్‌నెస్ నిలకడగా ఉండదు.
పాకిస్థాన్: ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని జట్టుగా పాకిస్థాన్‌ను చెబుతుంటారు. ఈ జట్టు ప్రధాన బలం పేసర్లే. షహీన్ షా అఫ్రీది స్వింగ్, నసీమ్ షా లెంగ్త్ బంతులతో పవర్‌ప్లేలోనే వికెట్లు తీసి వణికిస్తుంటారు. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారీఖ్‌ల కట్టడి కీలకం కానుంది. ఇక స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను ఈసారి వరల్డ్‌కప్ జట్టులో చేర్చారు. క్రితంసారి అతను లేకపోవడం జట్టును దెబ్బతీసిందనే అభిప్రాయం వినిపించింది. ఓపెనర్లు సయీమ్ అయూబ్, ఫఖర్ జమాన్ మెరుపు ఆరంభాలను బాబర్ కొనసాగించడంపై జట్టు విజయాలు ఆధారపడి ఉంటాయి.

న్యూజిలాండ్: చివరి టోర్నీలో కివీస్ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. పైగా ఈ మెగా టోర్నీకి ముందు భారత్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను కోల్పోయింది. బ్యాటింగ్‌లో సీఫర్ట్, కాన్వే, ఆలెన్, ఫిలిప్స్ లాంటి స్ట్రోక్ ప్లేయర్లకు కొదువలేదు. భారత్‌తో సిరీస్‌కు గాయంతో దూరమైన ఆలెన్, కాన్వే ఓపెనింగ్ చేయనున్నారు. ఆ తర్వాత ఫిలిప్స్, చాప్‌మన్, నీషమ్‌లతో మిడిలార్డర్ బలంగా ఉంది. దీనికి తోడు స్పిన్ ఆల్‌రౌండర్ల రూపంలో శాంట్నర్, మిచెల్, బ్రేస్‌వెల్, ఫిలిప్స్, రచిన్, చాప్‌మన్ జట్టు క్లిష్ట స్థితిలో బంతిని అందుకునే వీలుంటుంది. అయితే సౌథీ, బౌల్ట్ మాదిరి ప్రస్తుతం డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ లేకపోవడం లోటుగా ఉంది. హెన్రీ, డఫీ కొత్త బంతిని మాత్రమే స్వింగ్ చేయగలరు.
దక్షిణాఫ్రికా: చోకర్స్‌గా ముద్రపడిన దక్షిణాఫ్రికా జట్టు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఇప్పటిదాకా ఏ ఐసీసీ ట్రోఫీనీ అందుకోలేకపోయింది. 2024లో అదిరే ఆటతో ఫైనల్ వరకు చేరినా.. భారత్ చేతిలో పోరాడి ఓడింది. ఎలాంటి పిచ్‌పై అయినా కుడి ఎడమ కాంబినేషన్‌లో పేస్, స్పిన్ బౌలర్లు అందుబాటులో ఉండడం సానుకూలాంశం కానుంది. ముఖ్యంగా సఫారీల పేస్ దళం ప్రత్యర్థి జట్లను వణికించగలదు. లెఫ్టామ్ పేసర్లు యాన్సెన్, మఫాకలతో పాటు రబాడ, ఎన్‌గిడి, బాష్, నోకియా, స్మిత్ వీరి అమ్ములపొదిలో కీలకం కానున్నారు. స్పిన్‌లో కేశవ్, లిండే, మార్‌క్రమ్ అండగా అలాగే విదేశీ టీ20 లీగ్‌ల్లో సఫారీ ఆటగాళ్లు ఎక్కువగా ఆడుతుండడం కలిసిరావచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. నిలకడగా ధరలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ధి సభకు హాజరైన సల్మాన్ ఖాన్
Read Latest Telangana News and National News