టీ20 ప్రపంచ కప్ 2026.. టీమిండియాకు సవాలుతో కూడుకున్నదే: అనిల్ కుంబ్లే
ABN , Publish Date - Feb 03 , 2026 | 05:30 PM
ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 సమరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. 2024లో ఛాంపియన్‌గా నిలిచిన జట్టుతో పోలిస్తే ప్రస్తుత జట్టు కాస్త బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026.. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందులో భారత్ హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగనుంది. ఈ మెగా టోర్నీకి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే(Anil Kumble) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు పటిష్టంగానే కనిపిస్తుందని అన్నాడు. కానీ 2024లో ఛాంపియన్‌గా నిలిచిన జట్టుతో పోలిస్తే ప్రస్తుత జట్టు కాస్త బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డాడు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024లో రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలో భారత జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు రోహిత్ సేన తెరదించింది. సౌతాఫ్రికాతో ఉత్కంఠగా సాగిన ఫైనల్లో విజయం సాధించిన భారత్.. టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను ముద్దాడింది. కీలకమైన సమయాల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా అనుభవం భారత విజయానికి కలిసొచ్చింది. ఈ విజయం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో పొట్టి ఫార్మాట్‌కు ఈ ముగ్గురూ వీడ్కోలు పలికారు. ప్రస్తుత ప్రపంచ కప్‌లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా బరిలోకి దిగనుంది.
‘అనుభవం గురించి మాట్లాడితే విరాట్, రోహిత్‌లను టీమిండియా మిస్ అవుతోంది. కానీ ప్రస్తుత జట్టు బలంగానే ఉంది. మంచి బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాటింగ్ విషయానికొస్తే.. టాపార్డర్ పటిష్టంగా ఉంది. అయినప్పటికీ ఈ ప్రపంచ కప్ సవాలుతో కూడకున్నదే. 2024లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటి టీమ్‌తో పోలిస్తే 2024 టీ20 ప్రపంచ కప్‌లో ఆడిన భారత జట్టు 10 శాతం ముందుంది. కానీ ప్రస్తుత జట్టు దానికి చాలా దగ్గరగా ఉందని భావిస్తున్నా. ఈసారి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారత్‌కు చాలా కీలకం కానున్నాడు. అతడు బ్యాటర్‌గా రాణిస్తూనే జట్టును విజయపథంలో నడిపించాలి’ అని అనిల్ కుంబ్లే సూచించాడు.
ఇవి కూడా చదవండి:
అప్పుడు హాకీ.. ఇప్పుడు క్రికెట్.. అరుదైన ఘనత సాధించిన ఇటలీ కెప్టెన్
అభిమానులకు క్రేజీ న్యూస్.. డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టనున్న చెన్నై సూపర్ కింగ్స్!