అభిమానులకు క్రేజీ న్యూస్.. డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టనున్న చెన్నై సూపర్ కింగ్స్!
ABN , Publish Date - Feb 03 , 2026 | 02:19 PM
ఐపీఎల్‌లో టాప్ జట్లలో ఒకటైన సీఎస్కే డబ్ల్యూపీఎల్‌లోకి అడుగుపెట్టనున్నట్లు ఆ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. అయితే ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడే అమల్లోకి రాదని, తమ భవిష్యత్తు కార్యాచరణలో భాగమని ఆయన వివరించారు.
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఓ క్రేజీ న్యూస్. ఐపీఎల్‌లో టాప్ జట్లలో ఒకటైన సీఎస్కే డబ్ల్యూపీఎల్‌లోకి అడుగు పెట్టనున్నట్లు ఆ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్(Kasi Viswanathan) వెల్లడించారు. అయితే ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడే అమల్లోకి రాదని, తమ భవిష్యత్తు కార్యాచరణలో భాగమని ‘ఇన్వెస్ట్ ఇన్ తమిళనాడు’ సదస్సులో ఆయన వివరించారు.
‘ఇప్పటికిప్పుడు కాదు కానీ.. కచ్చితంగా త్వరలోనే సీఎస్కే(Chennai Super Kings)ను విస్తరిస్తాం. ముందుగా మేం మహిళల క్రికెట్‌లో అడుగు పెట్టబోతున్నాం. ఇతర క్రీడల్లో కూడా మా అదృష్టాన్ని పరీక్షించుకుంటాం’ అని కాశీ విశ్వనాథన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం డబ్ల్యూపీఎల్‌లో ముంబై, బెంగళూరు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఫ్రాంచైజీలు మాత్రమే ఉన్నాయి. ఐపీఎల్‌లో సత్తా చాటిన చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి జట్లు ఇంకా మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లోకి రాలేదు.
మరోవైపు.. డబ్ల్యూపీఎల్ 2026 తుది దశకు చేరుకుంది. ఫిబ్రవరి 5న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. కాగా నేడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌లో ఆర్సీబీతో పోటీ పడనుంది.
ఇవి కూడా చదవండి:
హెచ్‌సీఏలో కీలక పరిణామం.. నూతన అధ్యక్షుడిగా అమర్‌నాథ్
బాయ్‌కాట్ నష్టం రూ.2200 కోట్లు!