భారత్‌తో మ్యాచ్‌ను పాక్ బహిష్కరిస్తే ఏమౌతుందంటే..? ఐసీసీ నిబంధనలు ఇవే..
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:58 AM
టీ20 ప్రపంచ కప్-2026 మెగా టోర్నీలో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐసీసీలోని కొన్ని నిబంధనలు పాకిస్థాన్ కు గట్టి షాక్ ఇవ్వనున్నాయి.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్-2026 మెగా టోర్నీలో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాక్ నిర్ణయం ఐసీసీతో పాటు అన్ని దేశాలను షాక్‌కు గురి చేశాయి. ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ భారత్‌తో మాత్రం మ్యాచులు ఆడేందుకు నిరాకరించింది. అయితే అందుకు గల కారణాలను మాత్రం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలపలేదు. ఐసీసీ టోర్నీ నుంచి బహిష్కరించబడిన బంగ్లాదేశ్ జట్టుకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయంపై క్రికెట్ అభిమానులు, క్రీడా నిపుణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం టోర్నీ నుంచి బహిష్కరిస్తున్నట్లు నిర్ణయం తీసుకోవాలి.. కానీ.. ఇలా సెలెక్టీవ్‌గా ఒక దేశంతో మ్యాచ్ ను బహిష్కరించడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇలా సెలెక్టివ్ బాయ్‌కాట్‌ను ఐసీసీ అనుమతిస్తుందా? ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. వాక్ఓవర్ నియమం
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధనల ప్రకారం.. ఒక జట్టు మైదానంలోకి దిగడానికి నిరాకరిస్తే.. మ్యాచ్‌ను ప్రత్యర్థి జట్టుకు వాకోవర్‌గా ఇస్తారు. అయితే ప్రత్యర్థి జట్టు పాయింట్లు పొందాలంటే.. వారు మైదానంలో హాజరు కావాలి. ఈనెల 15న జరిగే మ్యాచ్‌లో భారత కెప్టెన్ (సూర్యకుమార్ యాదవ్ ) మైదానంలోకి వస్తే.. అదే సమయంలో పాకిస్థాన్ కెప్టెన్ రాకపోతే మ్యాచ్ రిఫరీ అధికారికంగా మ్యాచ్‌ను ఇండియా గెలిచినట్లు ప్రకటిస్తారు. అలానే భారత్‌కు 2 పాయింట్లు వస్తాయి. అంతేకాక ఐసీసీ నిబంధన 16.10.7 ప్రకారం.. మ్యాచ్‌కు హాజరు కానీ జట్టు (పాకిస్తాన్) 20 ఓవర్ల ఇన్నింగ్స్ పూర్తిగా ఆడినట్లు.. అలానే 0 పరుగులు చేసిన జట్టుగా మ్యాచ్ రిఫరీ పరిగణిస్తారు. ఫలితంగా బాయ్‌కాట్ చేసిన జట్టు రన్‌రేట్ గణనీయంగా తగ్గిపోతుంది. వారు తమ ఇతర మ్యాచ్‌లలో గెలిచినప్పటికీ సూపర్ 8లకు అర్హత సాధించడం చాలా కష్టమవుతుంది.
2. ఆర్థిక, వాణిజ్య జరిమానాలు:
ఈ మెగా టోర్నీలో పాక్ మ్యాచుల వరకు పరిస్థితి ఎలా ఉన్నా... ఆ దేశ క్రికెట్ బోర్డుకు(పీసీబీ) అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఇండియా, పాక్ మ్యాచ్ అనేది కేవలం ఈ టోర్నీకే కాదు.. మొత్తం క్రికెట్‌తో ముడిపడిన వ్యాపారానికి భారీ ఆదాయం సమకూర్చేది. భారత్‌తో పాక్ మ్యాచ్ ఆడకపోతే బ్రాడ్‌కాస్టర్లు (జియోస్టార్ వంటివి) 25 మిలియన్ల నుంచి 30 మిలియన్ల డాలర్ల వరకు ప్రకటన ఆదాయాన్ని కోల్పోతారని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో బ్రాడ్‌కాస్టర్లు ఐసీసీని రాయితీని అడుగుతాయి. ఆ నష్టాన్ని పీసీబీ నుంచే ఐసీసీ వసూలు చేస్తుంది. అలానే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు వచ్చే 70 నుంచి 80 వార్షిక ఆదాయం వాటాను ఐసీసీ నిలిపివేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో పీసీబీకి భారీగా ఆర్థిక నష్టం జరుగుతుంది.
3. క్రీడల్లో ప్రభుత్వ జోక్యం నిబంధన
ఐసీసీ ఆర్టికల్-2.4D ప్రకారం క్రికెట్ సభ్యత్వం ఉన్న ఆయ దేశాల బోర్డులు తమ వ్యవహారాలను స్వయం ప్రతిపత్తితో నిర్వహించుకోవాలి. క్రికెట్‌లో ప్రభుత్వ జోక్యాన్ని నివారించాలి. అయితే పాకిస్థాన్.. తమ దేశ ప్రభుత్వ ఆదేశాలను పాటించడం వల్ల ఈ నిబంధనలు ఉల్లంగించిందని ఐసీసీ భావించింది. గతంలో (1996, 2003) భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని జట్లు మ్యాచ్‌లను బహిష్కరించాయి. ఉదాహరణకు ఆస్ట్రేలియా శ్రీలంకలో మ్యాచులను బహిష్కరించింది. అయితే పాకిస్థాన్ భారత్‌లో మ్యాచ్ ఆడటం లేదు. తటస్థ వేదిక అయిన శ్రీలంకలో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తుంది. ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి కారణ ఏమిలేదు. కాబట్టి, పాక్ తీసుకున్న ఈ నిర్ణయం ఐసీసీ నిబంధనలు నేరుగా ఉల్లంఘించడమే అవుతుంది.
ఇవి కూడా చదవండి:
హెచ్‌సీఏలో కీలక పరిణామం.. నూతన అధ్యక్షుడిగా అమర్‌నాథ్
బాయ్‌కాట్ నష్టం రూ.2200 కోట్లు!