టీ20 వరల్డ్ కప్: భారత్‌తో ఆడబోమన్న పాకిస్థాన్.. ఐసీసీ స్పందన ఇదే..
ABN , Publish Date - Feb 02 , 2026 | 08:38 AM
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న తరుణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో తమ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్టు పాకిస్థాన్ ప్రకటించిన నేపథ్యంలో ఐసీసీ స్పందించింది. పీసీబీ ఈ నిర్ణయంపై మరోసారి ఆలోచించుకోవాలని కోరింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో గ్రూప్ దశలో భారత్‌తో మ్యాచ్‌లను పాకిస్థాన్ బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించడంపై ఐసీసీ మౌనం వీడింది. ఈ విషయమై పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(PCB) నుంచి తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదని వెల్లడించింది. పాక్ తీసుకున్న నిర్ణయంపై ఐసీసీ స్పందిస్తూ.. క్రికెట్ ప్రపంచంలో అన్ని దేశాలు పరస్పర గౌరవం, క్రీడాస్ఫూర్తికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. దీర్ఘకాల పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తమ నిర్ణయంపై పునరాలోలించుకోవాలని పీసీబీని కోరింది.
‘ఐసీసీ టోర్నమెంట్లు క్రీడా సమగ్రత, పోటీతత్వం, స్థిరత్వం, న్యాయబద్ధంగా నిర్వహించేవి. ఇందులో ఎంపిక చేసిన జట్లు పాల్గొనడం క్రీడా స్ఫూర్తికి నిదర్శనం. నిబంధనల్ని ఉల్లంఘించడం క్రీడా పవిత్రతను దెబ్బతీస్తుంది. జాతీయ విధాన విషయాలలో ప్రభుత్వాల పాత్రలను ఐసీసీ గౌరవిస్తోంది. అయినప్పటికీ పాక్ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ ప్రపంచానికి, అభిమానులకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. తమ సొంత దేశంలో క్రికెట్‌కు లభించే ఆదరణ, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పీసీబీ సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం’ అని ఐసీసీ పేర్కొంది.
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పొట్టి ప్రపంచ కప్ టోర్నీ ఈనెల 7 నుంచి ప్రారంభం కానుంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి బహిష్కరించిన ఐసీసీ.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను ఆడిస్తోంది. కానీ ఇటీవల నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ఈ టోర్నీలో భారత్‌తో ఆడేందుకు పాకిస్థాన్ నిరాకరిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటేనే క్రికెట్ అభిమానులు అమితాసక్తిని కనబరుస్తుంటారు. అందునా ప్రపంచ కప్ మ్యాచ్‌లంటే భారీ అంచనాలే ఉంటాయి. ఈ నేపథ్యంలో పాక్ బాయ్‌కాట్ నిర్ణయం, ఐసీసీ స్పందన తీవ్ర చర్చనీయాంశమైంది. తాజా పరిణామాలు ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయని సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
ఇవీ చదవండి:
ప్రపంచకప్‌లో పాల్గొంటాం.. భారత్‌తో ఆడం
భారత్‌కు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసిన తిలక్ వర్మ
పాక్‌ను పడగొట్టి.. సెమీస్‌కు భారత్