Share News

ప్రపంచకప్‌లో పాల్గొంటాం.. భారత్‌తో ఆడం

ABN , Publish Date - Feb 02 , 2026 | 05:54 AM

బంగ్లాదేశ్‌కు మద్దతుగా టీ20 ప్రపంచ కప్‌ను బహిష్కారిస్తామని ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్‌ అందుకు సాహించలేకపోయింది. బదులుగా.. టోర్నీకే తలమానికమైన భారత్‌తో తమ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్టు...

ప్రపంచకప్‌లో పాల్గొంటాం.. భారత్‌తో ఆడం

పాకిస్థాన్‌ ప్రభుత్వం ప్రకటన

నేడు భేటీ కానున్న ఐసీసీ

పాక్‌పై కఠిన చర్యలు ?

లాహోర్‌: బంగ్లాదేశ్‌కు మద్దతుగా టీ20 ప్రపంచ కప్‌ను బహిష్కారిస్తామని ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్‌ అందుకు సాహించలేకపోయింది. బదులుగా.. టోర్నీకే తలమానికమైన భారత్‌తో తమ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్టు పాకిస్థాన్‌ ఆదివారం ప్రకటించింది. ఈనెల 15న భారత్‌తో జరిగే మ్యాచ్‌ మినహా టోర్నమెంట్‌లో యధాప్రకారం పాకిస్థాన్‌ జట్టు ఆడుతుందని వెల్లడించింది. కాగా, భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరణకు కారణమేంటన్నది మాత్రం స్పష్టం చేయకపోవడం గమనార్హం. భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వరల్డ్‌ కప్‌ ఈనెల 7న మొదలవనున్న సంగతి తెలిసిందే. భద్రతా కారణాలు సాకుగా చూపుతూ భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్‌ నిరాకరించిన విషయం విదితమే. దాంతో బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి బహిష్కరించిన ఐసీసీ.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను ఆడిస్తోంది. ఈ వివాదంలో మొదటి నుంచీ బంగ్లాకు వంత పాడుతున్న పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) టోర్నీ నుంచి తప్పుకొంటామని బీరాలు పలుకుతూ వచ్చింది. వరల్డ్‌ కప్‌లో తాము ఆడే విషయాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుందని పీసీబీ చైర్మన్‌ మొహసిన్‌ నక్వీ గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలో మొత్తం టోర్నీని గాకుండా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్టు తాజాగా పాక్‌ ప్రభుత్వం తెలిపింది. ‘ప్రపంచక్‌పలో పాక్‌ జట్టు ఆడేందుకు ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ అనుమతి ఇస్తోంది. కానీ ఈనెల 15న భారత్‌తో జరిగే మ్యాచ్‌లో మాత్రం పాకిస్థాన్‌ తలపడబోదు’ అని పాక్‌ ప్రభుత్వం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇక..భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరణకు సంబంధించి పూర్తి వివరాలను పీసీబీ చైర్మన్‌ నక్వీ ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తాడని ఆ బోర్డు వర్గాలు తెలిపాయి. కాగా, భారత్‌తో మ్యాచ్‌ నిరాకరించడానికి పీసీబీ ఏ కారణాలు చెబుతుందనేది ఆసక్తికరం.


55-Sports.jpg

భారత్‌తో పాక్‌ ఆడకపోతే ఏం జరుగుతుంది?

టోర్నీలో పాకిస్థాన్‌ వాకోవర్‌ ఇవ్వడంతో ఆ మ్యాచ్‌ ద్వారా భారత్‌కు పూర్తి పాయింట్లు లభిస్తాయి. మ్యాచ్‌ను బహిష్కరించినందుకు పాకిస్థాన్‌పై ఐసీసీ భారీగా జరిమానా విఽధించనుంది. ఈనెల 7న జరిగే తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను పాకిస్థాన్‌ ఎదుర్కోనుంది. ఫిబ్రవరి 10న అమెరికాను, 18న నమీబియాను ఢీకొననుంది. ఈ మ్యాచ్‌లన్నీ కొలంబోలో జరగనున్నాయి.

ఐసీసీ చర్యలు

ఎలా ఉండొచ్చు?

పాకిస్థాన్‌ నిర్ణయంపై చర్చించేందుకు ఐసీసీ బోర్డు సోమవారం వర్చువల్‌గా సమావేశం కానుంది. ఈ విషయాన్ని బోర్డు సభ్యుడొకరు ఆదివారం రాత్రి వెల్లడించారు. ‘పీసీబీ నుంచి మాకు అధికారికంగా సమాచారం లేదు. కానీ ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందున.. ఐసీసీ బోర్డు వర్చువల్‌గా భేటీ కానుంది’ అని ఆ సభ్యుడు తెలిపారు. ఒకవేళ టోర్నీ నుంచి పాకిస్థాన్‌ను బహిష్కరిస్తే..ఆ జట్టు స్థానంలో ఉగాండాను ఐసీసీ బరిలో దించనుంది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సందర్భంగా ప్రకటనలకు భారీ డిమాండ్‌ ఉంటుంది. అది 10 సెకన్లకు రూ. 25 నుంచి 40 లక్షలుల ఉంటుందని సమాచారం. ఈ లెక్కన ఒక్క ప్రకటనల ద్వారానే బ్రాడ్‌కాస్టర్‌కు రూ. 200 కోట్లకుపైగా నష్టం వస్తుందని అంచనా. ఇక భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాక్‌పై ఐసీసీ తీసుకొనే చర్యలు ఇలా ఉండే చాన్సుంది.

  • పాక్‌ను వరల్డ్‌ కప్‌ నుంచి పూర్తిగా బహిష్కరణ.

  • ఐసీసీ ఆదాయం నుంచి పాకిస్థాన్‌ వాటా చెల్లింపుల నిలిపివేత.

  • మ్యాచ్‌ల ప్రసారదారుకు పూర్తి పరిహారం చెల్లించాలని ఆదేశం.

  • ద్వైపాక్షిక సిరీ్‌సలు ఆడకుండా పాకిస్థాన్‌పై నిషేధం. దాంతో ఆ జట్టు ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ పాయింట్లు, ఐసీసీ ర్యాంకులపై ప్రభావం.

  • పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో విదేశీ క్రికెటర్లు పాల్గొనకుండా నిషేధం.

ఇవి కూడా చదవండి:

అండర్ 19 ప్రపంచ కప్: పాకిస్థాన్‌తో మ్యాచ్.. మరోసారి విఫలమైన వైభవ్ సూర్యవంశీ

భారత్‌కు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసిన తిలక్ వర్మ

Updated Date - Feb 02 , 2026 | 05:54 AM