అండర్ 19 ప్రపంచ కప్: పాకిస్థాన్‌తో మ్యాచ్.. మరోసారి విఫలమైన వైభవ్ సూర్యవంశీ
ABN , Publish Date - Feb 01 , 2026 | 03:45 PM
అండర్ 19 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో టీమిండియా తలపడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా.. కాస్త తడబడుతోంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి విఫలమయ్యారు. అతడు ఔట్ అయిన తీరు ప్రస్తుతం అంతటా చర్చనీయాంశం అయింది.
ఇంటర్నెట్ డెస్క్: అండర్ 19 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో టీమిండియా తలపడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా.. కాస్త తడబడుతోంది. అయితే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఔట్ అయిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. ప్రత్యర్థి ఎవరైనా భారీ షాట్లతో విరుచుపడే వైభవ్.. పాక్‌తో మ్యాచ్ అనగానే కాస్త తడబడతాడు. అదే సీన్ మళ్లీ ఇప్పుడు కూడా రిపీట్ అయింది. అయితే ప్రస్తుతం మ్యాచ్(Under 19 WC 2026)లో ఒకే బంతికి రెండుసార్లు ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నా.. ఆ అవకాశాన్ని కాసేపైనా సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
అండర్ 19 ప్రపంచ కప్‌లో భాగంగా పాక్‌తో జరుగుతోన్న కీలక పోరులో వైభవ్(Vaibhav Suryavamshi) ఆదిలో తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. కేవలం 22 బంతుల్లోనే 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు సాధించి దూకుడుగా కనిపించాడు. అయితే 8వ ఓవర్‌లో జరిగిన డ్రామా గురించే ప్రస్తుతం చర్చ అంతా! పాక్ బౌలర్ మహమ్మద్ సయ్యం వేసిన ఆ ఓవర్ మూడో బంతికి వైభవ్ పుల్ షాట్ ఆడబోయాడు. బంతి బ్యాట్ పైభాగంలో తగిలి గాల్లోకి లేచింది. షార్ట్ మిడ్ వికెట్ వద్ద ఉన్న పాక్ ఫీల్డర్ హుజైఫాకు అది చాలా సులువైన క్యాచ్. కానీ అతను దాన్ని నేలపాలు చేశాడు.
అయితే క్యాచ్ డ్రాప్ అవ్వగానే వైభవ్ రన్ కోసం పరిగెత్తాడు. నాన్ స్ట్రైకర్ ఆరోన్ జార్జ్ నిరాకరించడంతో వెనక్కి తిరగాల్సి వచ్చింది. అప్పటికే ఫీల్డర్ బంతిని వికెట్ల వైపు విసిరాడు. అక్కడ వికెట్ కీపర్ లేకపోవడం, డైరెక్ట్ హిట్ అవ్వకపోవడంతో వైభవ్ తృటిలో రనౌట్ ప్రమాదం నుంచి కూడా తప్పించుకున్నాడు. అంటే ఒక్క బంతిలోనే అతనికి రెండుసార్లు లైఫ్ దొరికింది. స్టేడియంలోని అభిమానులంతా వైభవ్ ఇక పాకిస్థాన్‌ను ఓ ఆట ఆడుకుంటాడని ఆశపడ్డారు. కానీ ఆ అదృష్టం ఎక్కువ సేపు నిలవలేదు. ఆ తర్వాతి బంతికే వైభవ్ అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ షాక్ నుంచి భారత్ తేరుకోకముందే అదే ఓవర్ చివరి బంతికి కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే కూడా ఔట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే ఆరోన్ జార్జ్ క్లీన్ బౌల్డ్ అవ్వడంతో భారత్ కేవలం 47 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆ తర్వాత.. 32 ఓవర్లకు టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. వేదాంత్ త్రివేది(53*) హాఫ్ సెంచరీ చేశాడు. మరో ఎండ్‌లో అభిజ్ఞాన్ కుందు(16*) కొనసాగుతున్నాడు.
ఇవి కూడా చదవండి..
పాకిస్థాన్‌తో ప్రపంచకప్ మ్యాచ్.. కుర్రాళ్లతో సచిన్, లక్ష్మణ్ చిట్‌చాట్..
మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్