Share News

చిన్నోడికి చిక్కింది

ABN , Publish Date - Feb 02 , 2026 | 05:45 AM

స్పెయిన్‌ కుర్రాడు కార్లోస్‌ అల్కారజ్‌ తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. ఆదివారం టెన్నిస్‌ దిగ్గజం జొకోవిచ్‌తో జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో తను...

చిన్నోడికి చిక్కింది

  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత అల్కారజ్‌

  • ‘కెరీర్‌ స్లామ్‌’తో కొత్త చరిత్ర

  • ఫైనల్లో జొకోవిచ్‌ పరాజయం

  • అటు జొకోవిచ్‌.. ఇటు అల్కారజ్‌.. వయస్సురీత్యా

భారీ వ్యత్యాసం కలిగిన ఈ ఇద్దరూ చరిత్ర సృష్టించేందుకే తుది పోరులో తలపడ్డారు. కానీ 22 ఏళ్ల నయా స్పెయిన్‌ బుల్‌ అల్కారజ్‌కే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చిక్కింది. ఇప్పటికే ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌ నెగ్గిన అల్కారజ్‌.. మెల్‌బోర్న్‌ ట్రోఫీతో ‘కెరీర్‌ స్లామ్‌’ సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఇక ఎవరికీ సాధ్యం కాని రీతిలో 25వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను అందుకోవాలన్న జొకోవిచ్‌ కల మాత్రం మరోసారి భగ్నమైంది.

మెల్‌బోర్న్‌: స్పెయిన్‌ కుర్రాడు కార్లోస్‌ అల్కారజ్‌ తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. ఆదివారం టెన్నిస్‌ దిగ్గజం జొకోవిచ్‌తో జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో తను 2-6, 6-2, 6-3, 7-5తో గెలిచాడు. దీంతో కెరీర్‌ స్లామ్‌ (నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌) సాధించిన అతిపిన్న వయస్కుడిగానూ వరల్డ్‌ నెంబర్‌వన్‌ అల్కారజ్‌ (22 ఏళ్ల 272 రోజులు) రికార్డులకెక్కాడు. గతంలో డాన్‌ బడ్జ్‌ (1938లో 22 ఏళ్ల 363 రోజులు) పేరిట ఈ ఫీట్‌ ఉంది. ఓవరాల్‌గా కార్లోజ్‌కిది ఏడో గ్రాండ్‌స్లామ్‌ కాగా, కెరీర్‌ స్లామ్‌ అందుకున్న తొమ్మిదో ప్లేయర్‌. ఇంతకుముందు కార్లోస్‌.. యూఎస్‌ ఓపెన్‌ (2022, 2025), వింబుల్డన్‌ (2023, 2024), ఫ్రెంచ్‌ ఓపెన్‌ (2024, 2025) సాధించాడు. మరోవైపు 38 ఏళ్ల జొకోవిచ్‌ ఈ టైటిల్‌తో కెరీర్‌లో 25 గ్రాండ్‌స్లామ్స్‌ కలిగిన ఒకే ఒక్కడుగా నిలుద్దామనుకున్నా నిరాశే ఎదురైంది.


మెల్‌బోర్న్‌ పార్క్‌లో పది సార్లు ఫైనల్‌కు వచ్చిన ప్రతిసారీ విజేతగా నిలిచిన సెర్బియా స్టార్‌కు ఈసారి మాత్రం కార్లోస్‌ రూపంలో ఝలక్‌ తగిలింది. చివరగా జొకోవిచ్‌ 2023లో యూఎస్‌ ఓపెన్‌ గెలిచాడు. తాజా ఫైనల్లో అతడు తొలి సెట్‌ను గెలిచి అభిమానుల్లో జోష్‌ను నింపినా.. కార్లోస్‌ పుంజుకుని వరుసగా రెండు సెట్లను కైవసం చేసుకుని ఒత్తిడి పెంచాడు. అయితే నాలుగో సెట్‌ మాత్రం హోరాహోరీగా సాగింది. రెండో గేమ్‌ ఏకంగా 15 నిమిషాలపాటు సాగగా జొకో ఆరు బ్రేక్‌ పాయింట్లను కాపాడుకుని 1-1తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ వరుసగా సర్వీ్‌సలకు కాపాడుకుంటూ 5-5తో ఉత్కంఠ పెంచారు. ఈ దశలో కార్లోస్‌ వరుసగా 11, 12 గేమ్‌లను గెలిచి మ్యాచ్‌ను ముగించాడు. మొత్తంగా అల్కారజ్‌ తొమ్మిది, జొకోవిచ్‌ నాలుగు ఏస్‌లు సంధించారు.

ఇవి కూడా చదవండి:

అండర్ 19 ప్రపంచ కప్: పాకిస్థాన్‌తో మ్యాచ్.. మరోసారి విఫలమైన వైభవ్ సూర్యవంశీ

భారత్‌కు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసిన తిలక్ వర్మ

Updated Date - Feb 02 , 2026 | 05:45 AM