బాయ్‌కాట్ నష్టం రూ.2200 కోట్లు!
ABN , Publish Date - Feb 03 , 2026 | 05:56 AM
ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ట్రోఫీకే తలమానికమైన ఈ సమరంపై విశ్వవ్యాప్తంగా ఫైనల్‌కు మించిన ఆసక్తి ఏర్పడుతుంది...
భారత్-పాక్ పోరు నిర్వహణపై ఉత్కంఠ
ఐసీసీ నిర్ణయం కోసం ఎదురుచూపులు
న్యూఢిల్లీ: ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ట్రోఫీకే తలమానికమైన ఈ సమరంపై విశ్వవ్యాప్తంగా ఫైనల్‌కు మించిన ఆసక్తి ఏర్పడుతుంది. అటు టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోవడంతో పాటు బ్లాక్ మార్కెట్‌లో అయితే లక్షల్లో పలుకుతాయి. ఇక ఐసీసీకే కాకుండా బ్రాడ్‌కాస్టర్లకు కూడా కాసుల పంట పండుతుంది. అందుకే ఈ రెండు జట్లను ఒకే గ్రూప్‌లో ఆడిస్తారు. అయితే ఈనెల 7 నుంచి జరిగే టీ20 వరల్డ్‌క్‌పలో తమ జట్టు భారత్‌తో ఆడబోదని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఎందుకంటే మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ మ్యాచ్ జరగకపోతే ఏకంగా 250 మిలియన్ యూఎస్ డాలర్ల (రూ.2200 కోట్లు) నష్టం ఏర్పడ నుందని సమాచారం. ప్రసార హక్కులు, ప్రకటనల రేట్లు, స్పాన్సర్‌షిప్, టికెట్ల విక్రయాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాల ఆధారంగా ఈ విలువ లెక్కించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మరే మ్యాచ్‌కు కూడా ఇంత విలువ కనిపించదు. బ్రాడ్‌కాస్టర్ స్టార్ గ్రూప్ తమ వ్యాపార ప్రకటనల రూపంలోనే రూ.250 కోట్ల వరకు కోల్పోనుంది. దాయాదుల మ్యాచ్ సందర్భంగా ప్రకటనల రేటు 10 సెకన్లకే రూ.40 లక్షల వరకు పలుకుతుంది. వాస్తవానికి ప్రపంచక్‌పలో ఓ మ్యాచ్ సగటు విలువ రూ.138 కోట్లు మాత్రమే. మరోవైపు షెడ్యూల్ ప్రకారం ఈనెల 15న జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ ఆగిపోతే ఇరు బోర్డులకు కూడా రూ.200 కోట్ల నష్టం రానుంది. అత్యంత ధనిక బోర్డు బీసీసీఐకి ఈ నష్టం చిన్నదే కావచ్చు. కానీ పీసీబీపై మాత్రం గట్టి దెబ్బే పడనుంది. ఆ బోర్డుకు ఐసీసీ నుంచి అందే వార్షిక ఆదాయమే రూ.325 కోట్లు. దీనికి తోడు మ్యాచ్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకొంటుంది కాబట్టి బీమా రక్షణ కూడా ఉండదు. అలాగే ఐసీసీ విధించే పెనాల్టీ, ప్రసారకర్తల నుంచి చట్టపరమైన చర్యలను కూడా పాక్ బోర్డు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో ఒక్క బాయ్‌కాట్ నిర్ణయంతో పీసీబీ ఆర్థిక పునాదులు కదిలే పరిస్థితి నెలకొననుంది.
ఇవీ చదవండి:
ఆ వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే నన్ను క్షమించండి: మేరీ కోమ్