ఆ వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే నన్ను క్షమించండి: మేరీ కోమ్
ABN , Publish Date - Feb 02 , 2026 | 12:57 PM
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్.. ఓ టాక్ షోలో ఆమె తన మాజీ భర్త కరుంగ్ ఆంఖోలర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేరీ కోమ్ తాజాగా ఈ విషయంపై సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ తన వ్యక్తిగత జీవితం కారణంగా ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఓ టాక్ షోలో ఆమె తన మాజీ భర్త కరుంగ్ ఆంఖోలర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేరీ కోమ్ తాజాగా ఈ విషయంపై సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ఎంతో కాలంగా తనలో పేరుకుపోయిన ఆవేదనతోనే అలా మాట్లడానని, ఇతరులను బాధ పెట్టాలన్న ఉద్దేశం తనలో లేదని వివరణ ఇచ్చారు.
‘ఎన్నో ఏళ్ల పాటు మా వైవాహిక బంధం సజావుగానే సాగింది. కానీ నా భర్త నన్ను మోసగించడం వల్లే అది దెబ్బతింది. 2025లో మాకు విడాకులు అయిన తర్వాత సోషల్ మీడియాలో నన్ను చాలా రకాలుగా ట్రోల్స్ చేశారు. అప్పుడు కూడా నేను సంయమనం పాటించాను. ఇటీవల ఓ టాక్ షోలో నేను మాట్లాడిన మాటలతో ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించండి. మరీ ముఖ్యంగా పురుష సమాజం. నా వ్యక్తిగత జీవితంలో నేను అనుభవించిన బాధ నుంచి వచ్చిన మాటలు అవి. ఆ మాటలను వక్రీకరించారు.
నేను ఏ ఆటకు వ్యతిరేకం కాదు. నేను బాక్సర్‌నైనా ఫుట్‌బాల్‌ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను. సునీల్ ఛెత్రి, భైచుంగ్ భూటియా లాంటి దిగ్గజాలు కష్టపడి పైకి వచ్చారు. ప్రతి క్రీడాకారుడి ప్రయాణం కష్టంతోనే మొదలవుతుంది. నా వ్యాఖ్యలు ఏ క్రీడను లేదా ఆటగాళ్లను తక్కువ చేయాలనే ఉద్దేశంతో కాదు’ అని ఆమె వివరించారు. మాజీ భర్త కరుంగ్.. మేరో కోమ్ కోసం తన ఫుట్‌బాల్ కెరీర్‌ను త్యాగం చేశానని గతంలో చెప్పారు. అయితే ఆయనను తాను ఢిల్లీలో తొలిసారి కలిసినప్పటికే ఫుట్‌బాల్ ఆడటం మానేశారని మేరీ కోమ్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
డబ్ల్యూపీఎల్ 2026: ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్న యూపీ వారియర్స్
పాకిస్థాన్ ఎప్పుడూ ఒక్క మాట మీద నిలబడదు: సునీల్ గావస్కర్