పాకిస్థాన్ ఎప్పుడూ ఒక్క మాట మీద నిలబడదు: సునీల్ గావస్కర్
ABN , Publish Date - Feb 02 , 2026 | 10:23 AM
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. ఈ టోర్నీలో పాల్గొంటాం కానీ భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. పాకిస్థాన్ ఈ టోర్నీలో ఆడటంపై రోజుకో డ్రామా తెరమీదకి వస్తోంది. వరల్డ్ కప్ ఆడుతాం కానీ భారత్‌తో మ్యాచ్‌లను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఈ టోర్నీ(T20 World Cup 2026) నుంచే తప్పుకోవాలనుకున్న పాక్.. తమ ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరిస్తూ టీమిండియాతో మాత్రమే ఆడబోమని తేల్చి చెప్పింది. ఈ అంశంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar) స్పందించాడు.
‘ఇందులో కొత్తేముంది? పాకిస్థాన్ క్రికెటర్లు ముందు రిటైర్మెంట్ ప్రకటిస్తారు. నాలుగు రోజుల తర్వాత.. మా అభిమానులు మమ్మల్ని ఇంకా ఆడమన్నారని చెప్పి తమ రిటైర్‌మెంట్లను వెనక్కి తీసుకుంటారు. ఇలాంటిదే మరోసారి జరుగుతుంది. 15వ తేదీ కంటే ముందు ఇది జరిగొచ్చు. పాక్.. వారి మాజీ ఆటగాళ్ల నుంచి, ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తినప్పుడు తన వైఖరిని మార్చుకునే అవకాశం ఉంది. ఈ మెగా టోర్నీలో భారత్‌తో మ్యాచ్ నుంచి పాక్ వైదొలగడానికి సరైన కారణాలు, ఆధారాలు చూపించలేకపోతే ఐసీసీ చర్యలకు లోను కావాల్సి వస్తుంది ’ అని సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు.
ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుండగా.. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న భారత్-పాక్ తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం పాక్ శ్రీలంకకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పాకిస్థాన్ జట్టు మ్యాచ్ ఆడేందుకు మైదానంలోకి రాకపోతే.. మ్యాచ్ రిఫరీ తీసుకునే నిర్ణయం కోసం టీమిండియా ఎదురుచూడనుందని సమాచారం. ప్రస్తుతానికి ఈ విషయంపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే నాకౌట్ దశలో ఇరు దేశాల జట్లు మరోసారి తలపడాల్సి వస్తే పరిస్థితి ఏంటనే దానిమీద ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.
ఇవీ చదవండి:
ప్రపంచకప్‌లో పాల్గొంటాం.. భారత్‌తో ఆడం
భారత్‌కు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసిన తిలక్ వర్మ