Share News

ఈ గౌరవం ఎంతో ప్రత్యేకం.. పద్మశ్రీ అందుకోవడంపై స్పందించిన రోహిత్ శర్మ

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:34 PM

భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రతిష్టాత్మక పద్మ శ్రీ అవార్డు లభించిన విషయం తెలిసిందే. తాజాగా హిట్‌మ్యాన్ ఈ అంశంపై స్పందించాడు. ఈ గౌరవం తనకు, తన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని అన్నాడు.

ఈ గౌరవం ఎంతో ప్రత్యేకం.. పద్మశ్రీ అందుకోవడంపై స్పందించిన రోహిత్ శర్మ
Rohit Sharma

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రతిష్టాత్మక పద్మ శ్రీ అవార్డు లభించిన విషయం తెలిసిందే. తాజాగా హిట్‌మ్యాన్ ఈ అంశంపై స్పందించాడు. ఈ గౌరవం తనకు, తన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని అన్నాడు. ఈ సందర్భంగా తన క్రికెట్ ప్రయాణంలో తనకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు.


‘పద్మ శ్రీ(Padma Shri) అందుకోవడం నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన క్షణం. ఈ గౌరవాన్ని నాకు అందించిన భారత ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. నా క్రికెట్ కెరీర్‌లో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. దేశం కోసం మ్యాచ్‌లు, ట్రోఫీలు గెలిపించాలనే నా ప్రయత్నం ఎప్పటికీ కొనసాగుతుంది. ధన్యవాదాలు. జై హింద్’ అని రోహిత్ శర్మ ‘ఎక్స్’ వేదికగా విడుదల చేసిన ఓ వీడియోలో వెల్లడించాడు.


2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ(Rohit Sharma).. గత 19 ఏళ్లుగా అన్ని ఫార్మాట్లలో భారత జట్టుకు నిలకడైన ప్రదర్శనతో అండగా నిలిచాడు. బ్యాటర్‌గా మాత్రమే కాకుండా కెప్టెన్‌గా కూడా భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు ప్రపంచ వేదికపై ఎన్నో కీలక విజయాలు సాధించింది. 2024 టీ20 వరల్డ్‌ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో ఈ ఫార్మాట్‌లో ఐసీసీ ట్రోఫీ కోసం సాగిన దీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అనంతరం 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్ గెలుచుకుంది. దీంతో విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ ప్రతిష్ఠ మరింత పెరిగింది.


రికార్డుల మోత

రోహిత్ శర్మ 67 టెస్టుల్లో 12 శతకాలతో 4,300కుపైగా పరుగులు సాధించాడు. వన్డేల్లో 282 మ్యాచ్‌ల్లో 33 శతకాలతో 11,500కు పైగా పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్లో ఐదు శతకాలతో 4,231 పరుగులు చేసి అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు. ఇటీవలే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 వన్డే వరల్డ్‌ కప్‌ను లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.


ఇవి కూడా చదవండి:

అప్పుడు హాకీ.. ఇప్పుడు క్రికెట్.. అరుదైన ఘనత సాధించిన ఇటలీ కెప్టెన్

అభిమానులకు క్రేజీ న్యూస్.. డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టనున్న చెన్నై సూపర్ కింగ్స్!

Updated Date - Feb 03 , 2026 | 03:34 PM