వెస్టిండీస్‌ను తక్కువగా అంచనా వేయొద్దు.. టీమిండియాకు సన్నీ హెచ్చరిక
ABN , Publish Date - Feb 27 , 2026 | 05:08 PM
టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా మార్చి 1న కోల్‌కతా వేదికగా వెస్టిండీస్-భారత్ జట్లు చావో రేవో తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టే సెమీస్‌కు వెళ్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియాను మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ హెచ్చరించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో జింబాబ్వేపై విజయం సాధించిన టీమిండియా సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. లీగ్ స్టేజీని అజేయంగా ముగించి.. సూపర్ 8లో సౌతాఫ్రికాపై ఓటమిపాలవ్వడంతో సెమీస్ ఆశలు కాస్త సంక్లిష్టంగా మారాయి. అయితే జింబాబ్వే ఓడిపోవడంతో టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. సౌతాఫ్రికా సెమీస్‌కు అర్హత సాధించింది. మార్చి 1న కోల్‌కతా వేదికగా వెస్టిండీస్-భారత్ జట్లు చావో రేవో తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టే సెమీస్‌కు వెళ్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియాను మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ హెచ్చరించాడు.
‘టీమిండియాకు అసలు పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. జింబాబ్వేపై విజయం సాధించామని సంబరాలు పడొద్దు. అసలు సిసలైన సవాలు వెస్టిండీస్ మ్యాచ్‌లో ఉంది. వెస్టిండీస్‌ను అస్సలు లైట్‌గా తీసుకోలేం. వాళ్ల బ్యాటర్లు తొలి బంతి నుంచే దాడి మొదలు పెడతారు. కాబట్టి భారత్ స్మార్ట్ ప్లాన్‌తో బరిలోకి దిగాలి. వాళ్లు ఊహించని విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలి. టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్ పరంగా బలంగా ఉన్నా.. బౌలింగ్‌లో తేలిపోతున్నారు. ఒక్క తప్పిదం కూడా అత్యంత ఖరీదు అవుతుంది. కాస్త అజాగ్రత్తగా ఉన్నా మూల్యం చెల్లించుకోక తప్పదు. వెస్టిండీస్‌ను ఢీకొంటేనే సెమీస్‌కు వెళ్లగలం అని గుర్తుంచుకొని ఆడాలి’ అని సన్నీ టీమిండియాకు సూచించాడు.
అభి అద్భుతంగా ఆడాడు..
‘అభిషేక్ ఎంతటి భీకరి బ్యాటరో మనకు తెలుసు. అతడిపై కొంతమందికి ఉన్న అనుమానాలను ఈ ఇన్నింగ్స్‌తో తీర్చేశాడు. ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు కాస్త సమయం తీసుకున్నాడు. ఆఫ్ స్పిన్నర్‌ను గౌరవించాడు. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా చాలా కామ్‌గా పరుగులు రాబట్టాడు. అద్భుతంగా డిఫెన్స్ ఆడాడు. గతంలో మనం అభిషేక్‌కు ఇలా చూడలేదు. అందుకే నాకు చాలా ఆశ్చర్యమేసింది’ అని సునీల్ గావస్కర్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
వరుస డకౌట్లకు చెక్.. అభిషేక్ ఫామ్ అందుకోవడానికి కారణం అదే!
టీమిండియా కీలక పోరులో సత్తా చాటింది: సచిన్ టెండూల్కర్