వరుస డకౌట్లకు చెక్.. అభిషేక్ ఫామ్ అందుకోవడానికి కారణం అదే!
ABN , Publish Date - Feb 27 , 2026 | 03:04 PM
టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో జింబాబ్వేతో జరిగిన కీలక పోరులో టీమిండియా 72 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా తీసుకున్న ఓ సాహసోపేతమైన నిర్ణయం గురించి ప్రస్తుతం చర్చ నడుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో జింబాబ్వేతో జరిగిన కీలక పోరులో టీమిండియా 72 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా తీసుకున్న ఓ సాహసోపేతమైన నిర్ణయం గురించి ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఓపెనింగ్ జోడీ వైఫల్యాలకు చెక్ పెడుతూ సంజు శాంసన్‌ను బరిలోకి దించడం గెలుపులో కీలక పాత్ర పోషించింది.
ఈ టోర్నీలో గత 4 ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మల ఓపెనింగ్ జోడీ విఫలమైన సంగతి తెలిసిందే. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ వరుసగా మూడు డకౌట్లు, ఓ మ్యాచ్‌లో 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే ఈ ఇద్దరూ ఎడమచేతి వాటం బ్యాటర్లు కావడం ప్రత్యర్థి జట్లకు కలిసొచ్చింది. స్పిన్ బౌలర్లను బరిలోకి దింపి వీరిని కట్టడి చేశారు. పాకిస్థాన్.. సల్మాన్ అలీ అఘా, నెదర్లాండ్.. ఆర్యన్ దత్, సౌతాఫ్రికా.. ఐడెన్ మార్క్‌రమ్ చేతికి బంతిని అందించి ఫలితం రాబట్టింది. ఈ సమస్యను అధిగమించేందుకు టీమిండియా రింకు స్థానంలో సంజు శాంసన్‌కు అవకాశం ఇచ్చింది.
కుడిచేతి వాటం బ్యాటర్ అయిన సంజు స్పిన్నర్లను ఎదుర్కోవడంలో దిట్ట. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ఆఫ్ స్పిన్నర్ కావడంతో పవర్ ప్లేలో అతడు బౌలింగ్‌కు రాకుండా టీమిండియా తన వ్యూహాన్ని మార్చింది. సంజు క్రీజులో ఉండటంతో సికందర్ రజా తన ఆఫ్ స్పిన్ అస్త్రాన్ని పవర్ ప్లేలో ప్రయోగించలేకపోయాడు. ఇది మరో ఓపెనర్ అభిషేక్ శర్మకు వరంగా మారింది. వరుసగా విఫలమవుతూ వస్తోన్న అభిషేక్.. జింబాబ్వేపై సంజు అండతో స్వేచ్ఛగా ఆడాడు. పవర్ ప్లే ముగిసిన తర్వాత క్రీజులో సెట్ అయి ఉండటంతో స్పిన్నర్లనూ ధాటిగా ఎదుర్కొన్నాడు. కేవలం 30 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేసి ఫామ్ అందుకున్నాడు. మరో వైపు సంజు శాంసన్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. ఈ లెఫ్ట్-రైట్ కాంబినేషన్ వ్యూహం ఫలించడంతో టీమిండియా 256 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఇవి కూడా చదవండి:
కీలక మ్యాచ్‌లో గెలిచినా.. ఆందోళనలో టీమిండియా అభిమానులు!
విషాదం: భారత క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత..