మా నాన్న వెస్టిండీస్ బ్యాటర్లను శపించారు: అర్ష్‌దీప్ సింగ్
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:55 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో నిన్న దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌ను తన తండ్రి దర్శన్‌తో కలిసి టీవీలో వీక్షించినట్లు టీమిండియా ప్లేయర్ అర్ష్‌దీప్ సింగ్ తెలిపాడు. ఆ సమయంలో వెస్టిండీస్ బ్యాటర్లు బౌండరీలు కొడుతుంటే... తన తండ్రి అరిచాడని, వారిని శపించాడని వివరించాడు.
స్పోర్ట్స్ డెస్క్: సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు సత్తా చాటింది. నిన్న(గురువారం)చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి... 256 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో సీమర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) ఒక ఆసక్తికరమైన సంఘటనను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. గురువారం మధ్యాహ్నం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌ను తన తండ్రి దర్శన్‌తో కలిసి చెన్నైలోని ఓ హోటల్‌లో టీవీలో వీక్షించినట్లు తెలిపాడు. ఆ సమయంలో విండీస్ బ్యాటర్లు సిక్స్ కొట్టిన ప్రతిసారీ తన తండ్రి వారిపై అరిచాడని, వారిని శపించాడని వివరించాడు.
'నేను చెన్నైలోని ఓ హోటల్ లో ఉన్నాను. రూంలో మా కుటుంబం నాతో ఉంది. వెస్టిండీస్ క్రికెటర్లు సిక్సర్లు కొట్టిన ప్రతిసారీ మా నాన్న వారిపై అరవడం మొదలుపెట్టారు. ‘మీరు ఏం చేస్తున్నారు?’ అంటూ వారిపై సీరియస్ అయ్యాడు. నేను తర్వాత ఆయన్ను శాంతింపజేశాను. కేవలం క్రికెట్‌ను చూస్తూ ఆస్వాదించమని చెప్పాను. అలానే దక్షిణాఫ్రికా గెలవాలని ప్రార్థించండి' అని తన తండ్రికి తెలిపినట్లు అర్ష్‌దీప్ సింగ్ పేర్కొన్నాడు.
గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు ఒకానొక దశలో 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. హోల్డర్, షెపర్డ్ మధ్య 89 పరుగుల భాగస్వామ్యంతో ఆ జట్టు అనూహ్యంగా నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 176 పరుగులు చేసింది. అనంతరం 16.1 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి సౌతాఫ్రికా లక్ష్యాన్ని ఛేదించింది.
ఇవి కూడా చదవండి:
కీలక మ్యాచ్‌లో గెలిచినా.. ఆందోళనలో టీమిండియా అభిమానులు!
విషాదం: భారత క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత..