అభిషేక్ బ్యాటింగ్‌పై కామెంట్లు.. పాక్ మాజీ క్రికెటర్‌కు అశ్విన్ కౌంటర్!
ABN , Publish Date - Feb 27 , 2026 | 03:41 PM
అభిషేక్ శర్మ బ్యాటింగ్‌పై పాకిస్థాన్ మాజీ ప్లేయర్ ఆమిర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అతడో నైపుణ్యం లేని ఆటగాడంటూ అభివర్ణించాడు. ఈ అంశంపై ఘాటుగా స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్.. ఆమిర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 తొలి మూడు మ్యాచుల్లో అభిషేక్ శర్మ వరుసగా డకౌటైన విషయం తెలిసిందే. కాగా సూపర్ 8లో భాగంగా గురువారం జింబాబ్వేపై ఫామ్ అందుకుని హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 30 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సమయంలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు మహ్మద్ ఆమిర్.. అభిషేక్ బ్యాటింగ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘స్లాగర్’ అని అభివర్ణిస్తూ.. వ్యూహాత్మకంగా ఆడటం రాదని, భారీ షాట్లకు ప్రయత్నించి ఔటవుతాడంటూ కామెంట్లు చేశాడు. కాగా ఈ అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్.. ఆమిర్‌కు ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు.
‘అభిషేక్‌ను స్లాగర్ అనడం సరైంది కాదు. అభిషేక్ శర్మపై మహ్మద్ ఆమిర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీకు ఎక్కడ అతడు స్లాగర్‌లా కనిపిస్తున్నాడు? అతడికి ఉన్న బ్యాట్ స్వింగ్ ఈరోజుల్లో అత్యుత్తమమైన వాటిలో ఒకటి. అభిషేక్ గురువు, టీమిండియా మాజీ క్రికెటర్, పవర్ హిట్టర్ యువరాజ్ సింగ్ అందరికీ తెలిసిన వ్యక్తే. నిజానికి యువీ కంటే కూడా అభిషేక్‌కు మెరుగైన బ్యాట్ స్వింగ్ ఉండొచ్చు. యువీ కంటే కూడా చాలా దూకుడుగా ఆడే మనస్తత్వం ఉన్న ప్లేయర్ అతడు. బ్యాట్‌కు బంతి తగిలినప్పుడల్లా అది బౌండరీ దాటి వెళ్తుండటంతో చాలామంది పలురకాలుగా విమర్శలు చేస్తున్నారు. కానీ ప్రతి బంతికీ అటాకింగ్ మైండ్‌సెట్‌తో ఆడటం వల్లే అభిషేక్‌కు ఈ విమర్శలు తప్పడం లేదు’ అంటూ అశ్విన్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
వరుస డకౌట్లకు చెక్.. అభిషేక్ ఫామ్ అందుకోవడానికి కారణం అదే!
టీమిండియా కీలక పోరులో సత్తా చాటింది: సచిన్ టెండూల్కర్