ఐపీఎల్, భారత క్రికెట్‌పై విమర్శలు ఆపండి: సునీల్ గావస్కర్
ABN , Publish Date - Jun 10 , 2026 | 05:15 PM
ఐపీఎల్, భారత క్రికెట్‌పై వస్తున్న విమర్శలపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఘాటుగా స్పందించాడు. ఐపీఎల్, భారత క్రికెట్‌ను విమర్శించే వారే ఆదాయం కోసం తిరిగి బీసీసీఐని ఆశ్రయిస్తారని మండిపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్), భారత క్రికెట్‌పై వస్తున్న విమర్శలపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఘాటుగా స్పందించాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఇంగ్లండ్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్.. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టుకు దూరమయ్యాడు. దీంతో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. జాకబ్ బెథెల్ విషయంలో కూడా ఫ్రాంచైజీ క్రికెట్, అంతర్జాతీయ క్రికెట్ మధ్య పలు చర్చలు జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గావస్కర్ విమర్శలకు గట్టిగా బదులిచ్చాడు. ఐపీఎల్, భారత క్రికెట్‌ను విమర్శించే వారే ఆదాయం కోసం తిరిగి బీసీసీఐని ఆశ్రయిస్తారని మండిపడ్డాడు.
‘భారత క్రికెట్, బీసీసీఐపై విమర్శలు చేయడం కొందరికి అలవాటుగా మారింది. కానీ ఆదాయం కోసం వారు తిరిగి బీసీసీఐనే ఆశ్రయిస్తారు. ఎందుకంటే భారత క్రికెట్, భారత అభిమానులే వారి ఖజానాలను నింపుతున్నారు. ఐపీఎల్‌లో పాల్గొనే విదేశీ ఆటగాళ్ల ఫీజులో 10 శాతం వాటా ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు లభిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఐపీఎల్ కారణంగా తమ ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు అందుబాటులో ఉండరని ఫిర్యాదు చేయడం అలవాటుగా మారింది. కానీ అదే ఐపీఎల్ ద్వారా ఆ దేశ బోర్డులకు అందుతున్న డబ్బు గురించి మాత్రం ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడరు’ అని గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఆ పని చేసేది ఐపీఎల్ మాత్రమే..
‘ఐపీఎల్ ద్వారా ప్రతి ఏడాది విదేశీ బోర్డులకు లక్షల పౌండ్ల ఆదాయం వస్తోంది. మరి ‘ది హండ్రెడ్’ టోర్నీ విదేశీ ప్లేయర్ల బోర్డులకు వాటా ఇస్తుందా? బిగ్‌బాష్ లీగ్ లేదా ఇతర టీ20 లీగ్‌లు ఇస్తున్నాయా? లేదు కదా.. ఫారిన్ ప్లేయర్ల బోర్డులకు ఆదాయం కల్పించేది ఐపీఎల్ మాత్రమే. బీసీసీఐ, భారత క్రికెట్‌పై నిరంతరం విమర్శలు చేయడం ఆపాలి. వాస్తవాలను గుర్తించే సమయం వచ్చింది. భారత క్రికెట్ ఇక్కడే ఉంటుంది. దాన్ని ఎంత కిందకు లాగాలని ప్రయత్నించినా అది సాధ్యం కాదు’ అని గావస్కర్ ఘాటుగా మాట్లాడాడు.
ఇవి కూడా చదవండి:
ఇంగ్లండ్ ప్లేయర్లతో ఘర్షణ.. ఎవరీ రగ్బీ ప్లేయర్?
విరాట్‌తో వైభవ్ సూర్యవంశీని ఆడించాలి: శ్రీశాంత్