Share News

మానవ్ సుతార్‌కు కౌంటీ క్రికెట్ కాంట్రాక్ట్

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:03 PM

అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో యువ స్పిన్నర్ మానవ్ సూతార్ అరంగేట్రంలోనే 7 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ క్రమంలోనే సుతార్‌కు ఓ బంపరాఫర్ లభించింది. అతడికి ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో ఆడే అవకాశం దక్కింది.

మానవ్ సుతార్‌కు కౌంటీ క్రికెట్ కాంట్రాక్ట్
Manav Suthar

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో యువ స్పిన్నర్ మానవ్ సూతార్ అదిరే ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అరంగేట్రంలోనే 7 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ క్రమంలోనే సుతార్‌కు ఓ బంపరాఫర్ లభించింది. అతడికి ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో ఆడే అవకాశం దక్కింది. తాజాగా వార్విక్‌షైర్ క్రికెట్ క్లబ్ తరఫున సుతార్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.


ఈ ఒప్పందంతో 23 ఏళ్ల ఎడమచేతి స్పిన్నర్ మానవ్ సుతార్.. ఈ సీజన్‌లో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లోని తదుపరి రెండు రౌండ్ల మ్యాచ్‌ల్లో వార్విక్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. యార్క్‌షైర్, సమర్‌సెట్ జట్లతో జరిగే మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండనున్నట్లు క్లబ్ ప్రకటించింది. అఫ్గానిస్థాన్‌పై టెస్టు అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శనలతో మెరిసిన సుతార్.. జట్టు విజయానికి కీలకంగా నిలిచాడు. అంతకుముందు దేశవాళీ క్రికెట్‌లో కూడా అద్భుతంగా రాణించిన అతడు 29 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 129 వికెట్లు పడగొట్టి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.


సుతార్ రాకతో తమ బౌలింగ్ దళానికి కొత్త బలం చేకూరుతుందని వార్విక్‌షైర్ యాజమాన్యం అభిప్రాయపడింది. కౌంటీ ఛాంపియన్‌షిప్ టైటిల్ పోరులో జట్టుకు అతడి సేవలు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సుతార్ కూడా ఆనందం వ్యక్తం చేశాడు. ‘వార్విక్‌షైర్ జట్టులో చేరడం చాలా సంతోషంగా ఉంది. జట్టుకు టైటిల్ అందించేందుకు కృషి చేస్తాను’ అని తెలిపాడు. భారత టెస్టు జట్టులో అరంగేట్రం చేసిన కొద్ది రోజుల్లోనే కౌంటీ క్రికెట్‌లో అవకాశం దక్కించుకోవడం సుతార్ కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలిచింది.


ఇవి కూడా చదవండి:

ఇంగ్లండ్ ప్లేయర్లతో ఘర్షణ.. ఎవరీ రగ్బీ ప్లేయర్?

విరాట్‌తో వైభవ్‌ సూర్యవంశీని ఆడించాలి: శ్రీశాంత్

Updated Date - Jun 10 , 2026 | 04:24 PM