ఫిఫా ప్రపంచ కప్ 2026లో కొత్త నిబంధనలు
ABN , Publish Date - Jun 10 , 2026 | 03:29 PM
ఫిఫా ప్రపంచ కప్ 2026 మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీలో ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026 మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అయితే ప్లేయర్లు, కోచ్‌లు ఈ టోర్నీలో మరింత క్రమశిక్షణతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఫుట్‌బాల్ నిబంధనల రూపకల్పన సంస్థ(ఐఎఫ్ఏబీ) పలు కీలక మార్పులు చేసింది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీలో ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అవేంటంటే..
సబ్‌స్టిట్యూషన్ సమయంలో మైదానం వీడే ఆటగాడు 10 సెకన్లలోపే సమీప ఎగ్జిట్ ద్వారా బయటకు వెళ్లాలి. ఆలస్యం చేస్తే కొత్త ఆటగాడు వెంటనే మైదానంలోకి రావడానికి అనుమతి ఉండదు. తదుపరి ఆట ముగిసే వరకు జట్టు ఒక ప్లేయర్ లేకుండానే ఆడాల్సి ఉంటుంది.
త్రో-ఇన్ లేదా కార్నర్ కిక్ తీసుకోవడంలో ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తే రిఫరీ ఐదు సెకన్ల కౌంట్ డౌన్ ప్రారంభిస్తాడు. ఆ గడువు లోపు ఆట ప్రారంభించకపోతే బంతిని ప్రత్యర్థి జట్టుకు అప్పగించే అవకాశం ఉంటుంది.
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి హాఫ్‌లో హైడ్రేషన్ బ్రేక్ ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు.
ఒక ఆటగాడికి మైదానంలో వైద్య సహాయం అవసరమైతే, చికిత్స అనంతరం అతను మైదానం వీడి బయటకు వెళ్లాలి. ప్లే తిరిగి ప్రారంభమయ్యాక కనీసం 1 నిమిషం పాటు అతడు తిరిగి మైదానంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉండదు.
వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) పరిధిని కూడా విస్తరించారు. తప్పుగా ఇచ్చిన కార్నర్ కిక్ నిర్ణయాలను తిరిగి సమీక్షించే అవకాశం ఉంటుంది. అలాగే ఆట పునఃప్రారంభానికి ముందు జరిగిన పొరపాట్లను కూడా వీఏఆర్ పరిశీలించనుంది. పొరపాటుగా రెండోసారి ఎల్లో కార్డు చూపించినా.. వేరే ఆటగాడిపై క్రమశిక్షణ చర్య తీసుకున్నా VAR జోక్యం చేసుకోనుంది.
రిఫరీ నిర్ణయానికి నిరసనగా ఒక ఆటగాడు మైదానం వీడితే నేరుగా రెడ్‌కార్డు చూపిస్తారు. అలాంటి చర్యలకు కోచ్‌లు ప్రోత్సహించినా వారిపైనా అదే శిక్ష పడుతుంది. నిరసనల కారణంగా మ్యాచ్ నిలిచిపోతే సంబంధిత జట్టు మ్యాచ్‌ను కోల్పోయినట్లుగా పరిగణించే అవకాశం కూడా ఉంది.
ఇవి కూడా చదవండి:
ఇంగ్లండ్ ప్లేయర్లతో ఘర్షణ.. ఎవరీ రగ్బీ ప్లేయర్?
విరాట్‌తో వైభవ్ సూర్యవంశీని ఆడించాలి: శ్రీశాంత్