ఫిఫా ప్రపంచ కప్: మెస్సి వర్సెస్ రొనాల్డో.. మరోసారి తలపడతారా?
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:47 PM
ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచ కప్ 2026 మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అయితే దిగ్గజ ప్లేయర్లు లియోనెల్ మెస్సి, క్రిస్టియానో రొనాల్డో ఎదురెదురుగా తలపడితే చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచ కప్ 2026 మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అయితే దిగ్గజ ప్లేయర్లు లియోనెల్ మెస్సి, క్రిస్టియానో రొనాల్డో ఎదురెదురుగా తలపడితే చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇరువురికి ఇది ఆరో ప్రపంచ కప్ కావడం విశేషం. అర్జెంటీనా టీమ్ కెప్టెన్ మెస్సి, పోర్చుగల్ జట్టు ప్లేయర్ రొనాల్డో.. ఎదురెదురుగా తలపడే అవకాశాలు ఉన్నాయి.
చివరిసారిగా 2020లో బార్సిలోనా, జువెంటస్ మధ్య జరిగిన యూఈఎఫ్ఐ ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్‌లో మెస్సి, రొనాల్డో ఎదురెదురుగా తలపడ్డారు. ఆ మ్యాచ్‌లో రొనాల్డో రెండు గోల్స్ చేసిన బార్సిలోనాపై జువెంటస్‌కు 3-0 తేడాతో విజయాన్ని అందించాడు. 2026 ఫిఫా ప్రపంచ కప్‌లో మెస్సి నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు ‘జే’ గ్రూప్‌లో అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్‌లతో పోటీ పడనుంది. రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న పోర్చుగల్ జట్టు ‘కే’ గ్రూప్‌లో డీఆర్ కాంగో, ఉజ్బెకిస్థాన్, కొలంబియాలతో తలపడనుంది.
మెస్సి-రొనాల్డో తలపడేందుకు మూడు అవకాశాలు!
అర్జెంటీనా, పోర్చుగల్ జట్లు తమ గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిస్తే టోర్నమెంట్ నాకౌట్ డ్రాలో ఒకే వైపు ఉంటాయి. అనంతరం రౌండ్ ఆఫ్ 32, రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే క్వార్టర్ ఫైనల్లో మెస్సి - రొనాల్డో పోరు ఖాయం అవుతుంది.
ఒకవేళ రెండు జట్లు తమ గ్రూపుల్లో రన్నరప్‌లుగా నిలిస్తే క్వార్టర్ ఫైనల్‌లో కాకుండా నేరుగా రౌండ్ ఆఫ్ 16లోనే తలపడే అవకాశం ఉంటుంది. అయితే ఇరు జట్ల బలం దృష్ట్యా ఈ పరిస్థితి ఏర్పడే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.
ఒక జట్టు గ్రూప్ విజేతగా, మరో జట్టు రన్నరప్‌గా నిలిస్తే ఇరు జట్ల మార్గాలు వేర్వేరుగా ఉంటాయి. అలాంటి పరిస్థితిలో మెస్సి, రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు న్యూ జెర్సీలో జరిగనున్న ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ పోరులో తలపడే అవకాశం ఉంటుంది.
ఫిఫా ప్రపంచ కప్ 2026 మెస్సి, రొనాల్డోలకు చివరి వరల్డ్ కప్‌గా భావిస్తున్నారు. అందుకే ఈ దిగ్గజ ప్లేయర్లు మరోసారి ఒకే మైదానంలో పోటీ పడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఫైనల్లో మెస్సి-రొనాల్డో పోరు జరిగితే అది ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ప్రపంచ ఛాంపియన్‌గా నిలకవపోవడమే మంచిది: గుకేశ్
రిటైర్‌మెంట్ ఆలోచనలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్?