ప్రపంచ ఛాంపియన్‌గా నిలకవపోవడమే మంచిది: గుకేశ్
ABN , Publish Date - Jun 10 , 2026 | 10:49 AM
ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలవడం ఎంతోమంది కల. కానీ ఆ ఘనతను సాధించిన తర్వాత వచ్చే మానసిక ఒత్తిడి గురించి గుకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ టైటిల్ గెలవకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: నార్వే చెస్ టోర్నీ 2026లో భారత యువ గ్రాండ్ మాస్టర్, ప్రపంచ ఛాంపియన్ డి గుకేశ్ నిరాశాజనక ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఆరుగురు ప్లేయర్లతో తలపడిన గుకేశ్.. కేవలం ఒకే క్లాసికల్ గేమ్‌లో విజయం సాధించి అట్టడుగు స్థానంలో నిలిచాడు. అయితే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలవడం ఎంతోమంది కల. కానీ ఆ ఘనతను సాధించిన తర్వాత వచ్చే మానసిక ఒత్తిడి గురించి గుకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ టైటిల్ గెలవకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డాడు.
‘బయటి ప్రపంచాన్ని ఎంత దూరం పెట్టాలని ప్రయత్నించినా ఫలితం ఉండదు. మీపై ఉన్న అంచనాలు.. మీపై మీరే పెట్టుకున్నా లక్ష్యాలు గుర్తుకు వస్తూనే ఉంటాయి. నేను ఎప్పుడూ విజయాల కోసం ప్రయత్నించే ఆటగాడిని. అందుకే ఈ దశ కాస్త కఠినంగా అనిపిస్తోంది. దీనిని అధిగమిస్తానో.. లేక దాని కింద పడి నలిగిపోతానో చూడాలి. ప్రపంచ ఛాంపియన్ అవ్వాలనేది నా చిన్ననాటి లక్ష్యం. 18 ఏళ్లకే ఆ కల నెరవేరింది. నిజానికి ఆ ఘనత సాధించకపోవడమే చాలా మంది అదృష్టం. ఎందుకంటే వాళ్లు ముందుకు సాగేందుకు ఎప్పుడూ ఒక లక్ష్యం ఉంటుంది. అది సాధించిన తర్వాత మిమ్మల్ని ముందుకు నడిపించేందుకు మరో కారణాన్ని వెతుక్కోవాలి’ అని గుకేశ్ వెల్లడించాడు.
అదే నన్ను నడిపిస్తోంది..
ఈ పరిస్థితిని అధిగమించేందుకు మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ అప్‌టోన్‌తో కలిసి పనిచేస్తున్నట్లు గుకేశ్ వెల్లడించాడు. ‘ప్రస్తుతం నేను పూర్తిగా నా అత్యుత్తమ స్థితిలో లేను. అయినప్పటికీ ప్రతి రోజు చెస్ గురించి కొత్తగా ఏదో నేర్చుకోవడంపై దృష్టి పెడుతున్నాను. ఫలితాలు నిరాశపరిచినా చెస్‌పై ప్రేమ మాత్రం తగ్గలేదు. అదే నన్ను ముందుకు నడిపిస్తోంది’ అని గుకేశ్ స్పష్టం చేశాడు. ఈ ఏడాది చివర్లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ సిందరోవ్‌తో ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కాపాడుకునే పోరుకు గుకేశ్ సిద్ధమవుతున్నాడు. అయితే ప్రస్తుతం తనకు అతిపెద్ద సవాలు అంచనాలను నిలబెట్టుకోవడమేనని గుకేశ్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
పుట్‌బాల్ మ్యాచ్‌లో ఊహించని ఘటన! కెమెరా కిందపడి..
రిటైర్‌మెంట్ ఆలోచనలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్?