రిటైర్‌మెంట్ ఆలోచనలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్?
ABN , Publish Date - Jun 10 , 2026 | 10:01 AM
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. ఓ నైట్ క్లబ్‌లో మద్యం తాగి ఓ రగ్బీ ప్లేయర్‌తో వాగ్వాదానికి దిగిన ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు అనంతరం స్టోక్స్, అట్కిన్సన్ నైట్‌క్లబ్‌లో మద్యం తాగి ఓ రగ్బీ ప్లేయర్‌తో వాగ్వాదానికి దిగిన ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకునేందుకు తన సుదీర్ఘకాల సలహాదారు నీల్ ఫెయిర్ బ్రదర్‌ను స్టోక్స్ బుధవారం కలవనున్నట్లు సమాచారం. నైట్‌క్లబ్ ఘటనపై విచారణకు ఆదేశించిన ఈసీబీ.. క్రమశిక్షణ చర్యలు తీసుకోకముందే తానే తప్పుకోవాలని స్టోక్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు అనంతరం స్టోక్స్, పేసర్ గస్ అట్కిన్సన్ జట్టు నిబంధనలను ఉల్లంఘించి నైట్ క్లబ్‌లో ఓ రగ్బీ ఆటగాడితో ఘర్షణకు దిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో ఇంగ్లండ్ జట్టు భద్రతా సిబ్బందిలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), క్రికెట్ రెగ్యులేటర్ దర్యాప్తు చేపట్టాయి. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన స్టోక్స్, అట్కిన్సన్‌లపై సస్పెన్షన్ విధించే అవకాశాలు ఉన్నాయని బ్రిటిష్ మీడియా పేర్కొంది. మిగిలిన న్యూజిలాండ్ సిరీస్ మ్యాచ్‌లకు వీరిద్దరూ దూరమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, ఈ వివాదం కారణంగా స్టోక్స్ ఆకస్మికంగా రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశమున్నట్లు ఈసీబీ వర్గాలు వెల్లడించాయి. పరిస్థితిని సమీక్షించేందుకు మంగళవారం అత్యవసర బోర్డు సమావేశం కూడా నిర్వహించినట్లు సమాచారం.
కెరీర్ ముగిసినట్లేనా?
35 ఏళ్ల స్టోక్స్.. టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలా? లేక కొంతకాలం ఆటకు విరామం ఇవ్వాలా? అనే అంశాలపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. 2027 యాషెస్ సిరీస్ వరకు అమల్లో ఉన్న తన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కొనసాగించాలా? వద్దా? అనే అంశాన్ని కూడా అతడు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, జూన్ 17 నుంచి ది ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్టుకు సంబంధించిన జట్టును ఈ వారాంతంలో ఈసీబీ ప్రకటించనుంది. స్టోక్స్ తుది నిర్ణయం ఏదైనప్పటికీ జట్టు ఎంపిక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. స్టోక్స్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నాడని, అదే సమయంలో ఈసీబీ తీరుపై కొంత అసంతృప్తితో ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పటికే టీ20, వన్డే ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన స్టోక్స్.. ఈ ఘటనతో టెస్టులకు కూడా రిటైర్‌మెంట్ ఇస్తే తన 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసినట్లే!
ఇవి కూడా చదవండి:
ట్రై సిరీస్: రుతురాజ్ సెంచరీ.. శ్రీలంక ఎ టార్గెట్ ఎంతంటే?
ప్రియాంశ్ ఆర్య వింత రనౌట్.. అంపైర్ నిర్ణయంపై చర్చ!