రుతురాజ్ శతకం
ABN , Publish Date - Jun 10 , 2026 | 03:54 AM
ముక్కోణపు వన్డే సిరీ్‌సలో భారత్ ‘ఎ’ జట్టు శుభారంభం చేసింది. మంగళవారం ఆతిథ్య శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్ 8 పరుగులతో గట్టెక్కింది...
శ్రీలంక ‘ఎ’పై భారత్ ‘ఎ’ ఉత్కంఠ విజయం
తిలక్ హాఫ్ సెంచరీ
వైభవ్ విఫలం
దంబుల్లా: ముక్కోణపు వన్డే సిరీ్‌సలో భారత్ ‘ఎ’ జట్టు శుభారంభం చేసింది. మంగళవారం ఆతిథ్య శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్ 8 పరుగులతో గట్టెక్కింది. తొలుత భారత్ 50 ఓవర్లలో 277/6 స్కోరు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (101) సెంచరీ సాధించగా.. కెప్టెన్ తిలక్ వర్మ (60), ప్రియాన్ష్ ఆర్య (32) ఆకట్టుకున్నారు. అయితే వైభవ్ సూర్యవంశీ (14) ప్రదర్శన కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసినా, ఈ మ్యాచ్‌లో అతను స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. 16/2 స్కోరుతో ఇబ్బందుల్లో పడిన జట్టును రుతురాజ్-తిలక్ జోడీ నాలుగో వికెట్‌కు 150 రన్స్ జోడించి ఆదుకుంది. వరుస ఓవర్లలో వీరు వెనుదిరిగినా.. చివర్లో సూర్యాన్ష్ (26 నాటౌట్), ఆయుష్ బదోని (24) వేగంగా ఆడి జట్టు స్కోరును 270 దాటించారు. షిరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో లంక ఆటగాళ్లు చివరి వరకు అద్భుతంగా పోరాడారు. కానీ, మరో బంతి ఉందనగా, 49.5 ఓవర్లలో 269 రన్స్‌కు ఆలౌటయ్యారు. కెప్టెన్ సహన్ (74), డిక్‌వెల్లా (47), సమరవిక్రమ (46), అవిష్క (45) రాణించారు. చివర్లో వనుజ (23) పోరాటంతో లంక గెలిచేలా కనిపించింది. అయితే 12 బంతుల్లో 10 రన్స్ కావాల్సిన వేళ 49వ ఓవర్‌లో అర్షద్ రెండు వికెట్ల్లు తీయగా, వనుజ రనౌట్ కావడంతో భారత్ ‘ఎ’ ఊపిరి పీల్చుకుంది.
రనౌట్ వివాదం: లంక ఇన్నింగ్స్ 42వ ఓవర్‌లో రనౌట్‌పై అంపైర్ నిర్ణయం వివాదాస్పదమైంది. విప్రాజ్ లెంగ్త్ డెలివరీని ఆడిన కరుణరత్నె సింగిల్ కోసం పరిగెత్తి తిరిగి వెనక్కి మళ్లాడు. కానీ అప్పటికే బ్యాక్‌వర్డ్ పాయింట్ నుంచి వచ్చిన త్రో నేరుగా వికెట్లను గిరాటేసింది. ఆ సమయానికి కరుణరత్నె క్రీజు బయటే ఉన్నాడు. కానీ థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఎందుకంటే.. రీప్లేలో ఆ బంతి వికెట్లను తాకకముందే కీపర్ ప్రభ్‌సిమ్రన్ బెయిల్స్‌ను తొలగించినట్టు తేలింది. దీంతో భారత ఆటగాళ్లు ఫీల్డ్ అంపైర్‌తో కాసేపు వాగ్వాదం చేసినా ఫలితం లేకపోయింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ ‘ఎ’: 50 ఓవర్లలో 277/6 (రుతురాజ్ 101, తిలక్ 60, ప్రియాన్ష్ 32; షిరాజ్ 2/67).
శ్రీలంక ‘ఎ’: 49.5 ఓవర్లలో 269 ఆలౌట్ (సహన్ 74, డిక్‌వెల్లా 47, సమరవిక్రమ 46, ఫెర్నాండో 45; అర్షద్ 2/24, బదోని 2/46, అనుకుల్ 2/49).
ఇవి కూడా చదవండి:
ప్రియాంశ్ ఆర్య వింత రనౌట్.. అంపైర్ నిర్ణయంపై చర్చ!