గంభీర్‌కు షాక్.. నేరుగా బీసీసీఐని సంప్రదించిన సీనియర్లు!
ABN , Publish Date - Jun 10 , 2026 | 03:56 PM
వన్డే ప్రపంచకప్2027 ఆడటమే లక్ష్యంగా టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముందుకు సాగుతున్నారు. అయితే, హెడ్‌కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం వీరి పట్ల సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గంభీర్ కు సీనియర్లు షాకిచ్చినట్లు తెలుస్తోంది.
స్పోర్ట్స్ డెస్క్: గత కొంతకాలంగా టీమిండియా జట్టులోని సీనియర్లకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ లకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ.. టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్టు, టీ20 ఫార్మాట్లకు రిటైర్‌మెంట్ ప్రకటించారు. వారిద్దరి రిటైర్‌మెంట్ కు కారణంగా గౌతమ్ గంభీర్ అనే టాక్ ఉంది. అలా టెస్టుల్లో , టీ 20ల్లో భారత జట్టుపై పట్టు సాధించిన గంభీస్ వన్డేల్లో మాత్రం సక్సెస్ కాలేపోయాడు. తాజాగా అతడి విషయంలో సీనియర్ ప్లేయర్లు నేరుగా బీసీసీఐని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వన్డే ప్రపంచకప్2027 ఆడటమే లక్ష్యంగా రోహిత్, కోహ్లీ ముందుకు సాగుతున్నారు. అయితే, హెడ్‌కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం వీరి పట్ల సుముఖంగా లేనట్లు సమాచారం. వరల్డ్ కప్ ఆడే విషయంలో రో-కోలకు తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని అగార్కర్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాడు. ఇందుకు కోహ్లీ కూడా ఇటీవలే గట్టి కౌంటర్ ఇచ్చాడు. తనను తాను నిరూపించుకోవాలని పదే పదే ఒత్తిడి చేస్తే.. అందుకు తాను తలవంచనని చెప్పేశాడు.
ఈ క్రమంలో బీసీసీఐ వర్గాలు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సంచలన విషయాలు వెల్లడించాయి. సీనియర్ ఆటగాళ్లు గంభీర్, అగార్కర్‌లను కాదని బీసీసీఐ ఉన్నతాధికారులతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నాయి. ‘జట్టులో దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. వన్డే జట్టు విషయంలో కెప్టెన్ గిల్ ప్రతీ విషయంలో డ్రెసింగ్‌రూమ్ గట్టిగా తన గొంతు వినిపించాల్సి ఉంది. టెస్టు, టీ20 ఫార్మాట్లలో మాదిరి గంభీర్ వన్డే జట్టు విషయంలో ఎక్కువగా శ్రద్ధ చూపడం లేదు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. వన్డే ప్రపంచ కప్ 2027 సన్నాహకాలు మొదలయ్యాయి' అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
'ఇకపై గంభీర్- గిల్ మరి కాస్త కఠినంగా ఉండవచ్చు. డ్రెసింగ్ రూమ్‌లో తన ఆలోచనలు బలంగా వినిపించవచ్చు. చాలా ఏళ్లుగా సేవలు అందిస్తున్న సీనియర్లు రానున్న కాలంలో జట్టులో తమ పాత్ర ఏమిటన్న అంశం గురించి గంభీర్‌తో కాకుండా నేరుగా బీసీసీఐ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. తమ భవితవ్యంపై స్పష్టతనివ్వాలని కోరుతున్నారు’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.