రాహుల్ గాంధీని కలిసిన అభిషేక్ బెనర్జీ
ABN , Publish Date - Jun 10 , 2026 | 02:22 PM
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ బుధవారంనాడు న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని కలిశారు.
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ (Abhisekh Banerjee) బుధవారంనాడు న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)ని కలిశారు. టీఎంసీలో నెలకొన్న రాజకీయ సంక్షోభం, ఎంపీల రాజీనామాల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో రాహుల్‌ను అభిషేక్ బెనర్జీ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి ఒక రోజు ముందు కాంగ్రెస్ పార్లమెంటరీ చీఫ్ సోనియాగాంధీని ఆమె నివాసంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కలుసుకున్నారు. అందుకు కొనసాగింపుగానే అభిషేక్ బెనర్జీ రాహుల్‌ను కలుసుకున్నట్టు చెబుతున్నారు.
వేగంగా మారుతున్న సమీకరణలు
టీఎంసీలో చెలరేగిన తుపాను బుధవారంనాడు కూడా కొనసాగింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ వెంటనే అస్సాం ముఖ్యమంత్రి హింత బిశ్వశర్మను ఢిల్లీలో కలుసుకున్నారు. దీంతో ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు నెలకొన్నాయి. దీనికి ముందు ఈనెల 8న టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేశారు. సుమారు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటు చేయడంతో టీఎంసీలో చీలిక అనివార్యం కానుందనే ఊహాగానాల మధ్య రాజ్యసభ ఎంపీల రాజీనామా పర్వం కొనసాగుతుండటం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది.
ఇండియా కూటమి ఇటీవల న్యూఢిల్లీలో సమావేశమైన సమయంలోనే టీఎంసీ లోక్‌సభ ఎంపీల తిరుగుబాటు సంచలనమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీఎంసీ అగ్రనేతలు వరుసగా కాంగ్రెస్ కేంద్ర నాయకత్వాన్ని కలుస్తున్నారు. అభిషేక్ బెనర్జీ, రాహుల్ సమావేశంలో ప్రధానంగా ఇండియా కూటమిలో సమన్వయం, టీఎంసీలో తిరుగుబాట్లు, పునరుద్ధరణ చర్యలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల ఫోర్జరీ సంతకాల కేసులో ఈడీ సోదాల నేపథ్యంలో అభిషేక్ బెనర్జీని అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
ప్రధాని పదవిలో చరిత్ర సృష్టించిన మోదీ.. మంత్రివర్గం స్టాండింగ్ ఒవేషన్, తీర్మానం
తమిళ రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.! కీలక ప్రకటన వాయిదా