Share News

తమిళ రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.! కీలక ప్రకటన వాయిదా

ABN , Publish Date - Jun 10 , 2026 | 01:42 PM

తన రాజకీయ ప్రవేశంపై కీలక రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు ఇటీవల వెల్లడించిన రాఘవ లారెన్స్.. తాజాగా ఆ తేదీని వాయిదా వేశారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూయడంతో ఆయనకు గౌరవ సూచకంగా తన ప్రకటనను వాయిదా వేసుకున్నారు.

తమిళ రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.! కీలక ప్రకటన వాయిదా

ఇంటర్నెట్ డెస్క్: తమిళ రాజకీయాల్లోకి డ్యాన్సర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ విషయమై లారెన్స్ స్పందిస్తూ.. జూన్ 11న తన నిర్ణయం వెల్లడిస్తానని తొలుత చెప్పారు. అయితే.. ఆ రోజు సమీపిస్తున్న తరుణంలో తాజాగా.. ఆయన తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. మరుసటి రోజు అనగా ఈ నెల 12న(శుక్రవారం) ఉదయం 10:00 గంటలకు తన నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


'అందరికీ నమస్కారం! జూన్ 11న ఉదయం 9:30 గంటలకు నా జీవితంలో ఓ ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్లు నేను గతంలో చెప్పాను. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతా భారతీరాజా సర్ మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నేను నా కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధతో ఉన్నాను. ఆయనపై ఉన్న గౌరవంతో, సినిమాకు ఆయన అందించిన సహకారానికి గుర్తుగా, నేను నా ప్రకటనను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాను. నా ఈ ప్రకటనను ఈ నెల 12న(శుక్రవారం) ఉదయం 10:00 గంటలకు తెలియజేస్తాను' అని లారెన్స్ పేర్కొన్నారు.


షెడ్యూల్ ప్రకారం.. రేపు(గురువారం) ఉదయం 9:30 గంటలకు తన జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు లారెన్స్ గతంలో ప్రకటించారు. అయితే.. ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూయడంతో సినీ పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయిన నేపథ్యంలో, ఆయనకు గౌరవ సూచకంగా తన ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా.. తిరుచ్చి ఈస్ట్‌ అసెంబ్లీ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో రాఘవ లారెన్స్‌ పోటీ చేయనున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో ఆయన చేసిన పోస్ట్‌తో ఎంతగానో ఎదురుచూసిన అభిమానులు.. తాజా ప్రకటనతో మరుసటి రోజు వరకు వేచిచూడాల్సి వస్తోంది.


ఇవీ చదవండి:

పీఓకేలో ఉద్రిక్తత.. కశ్మీర్‌లో జోజిలా సంబరాలు

మమతకు షాక్.. టీఎంసీకి మరో ఎంపీ రాజీనామా..

Updated Date - Jun 10 , 2026 | 02:13 PM