Share News

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: నంబర్ 1 బ్యాటర్‌గా హ్యారీ బ్రూక్

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:48 PM

టెస్టు ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 869 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: నంబర్ 1 బ్యాటర్‌గా హ్యారీ బ్రూక్
Harry Brook

ఇంటర్నెట్ డెస్క్: టెస్టు ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 869 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కొంతకాలంగా టాప్ ప్లేస్‌లోనే ఉన్న మరో ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్.. రెండు స్థానాలు కోల్పోయి 851 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. కాగా రెండో స్థానంలో ఆస్ట్రేలియా హిట్టర్ ట్రావిస్ హెడ్(853) కొనసాగుతున్నాడు.


న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో రూట్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో తన అగ్రస్థానాన్ని రూట్ నిలబెట్టుకోలేకపోయాడు. మరోవైపు హ్యారీ బ్రూక్ తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం సాధించి తిరిగి నంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. 2024 తర్వాత బ్రూక్ తిరిగి అగ్రస్థానాన్ని అందుకోవడం విశేషం. భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానం సంపాదించుకున్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో 126 పరుగులతో భారీ శతకం సాధించిన అతడు.. రెండు స్థానాలు ఎగబాకి 743 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. భారత టెస్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక స్థానం కోల్పోయి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు.


అఫ్గానిస్థాన్‌పై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న వాషింగ్టన్ సుందర్.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించాడు. బ్యాటర్ల జాబితాలో ఐదు స్థానాలు ఎగబాకి 42వ స్థానానికి చేరుకోగా, ఆల్‌రౌండర్ల జాబితాలో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని తొమ్మిదో స్థానంలో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కూడా ఐదు స్థానాలు ఎగబాకి 48వ స్థానానికి చేరుకున్నాడు. అఫ్గానిస్థాన్‌పై టెస్టు అరంగేట్రంలోనే ఏడు వికెట్లు, వేగవంతమైన 28 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన యువ స్పిన్నర్ మానవ్ సుతార్ కూడా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో 82వ స్థానానికి చేరగా, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 72వ స్థానంలో నిలిచాడు.


టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా(870) అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో స్టార్క్(838), ప్యాట్ కమిన్స్(832) ఉన్నారు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టిన ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ ఏడు స్థానాలు ఎగబాకి బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 10వ స్థానానికి చేరుకున్నాడు. కాగా ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా(446) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.


ఇవి కూడా చదవండి:

ఇంగ్లండ్ ప్లేయర్లతో ఘర్షణ.. ఎవరీ రగ్బీ ప్లేయర్?

విరాట్‌తో వైభవ్‌ సూర్యవంశీని ఆడించాలి: శ్రీశాంత్

Updated Date - Jun 10 , 2026 | 04:48 PM