Share News

ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా గంగూలీ

ABN , Publish Date - Oct 06 , 2026 | 01:49 PM

భారత క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు.

ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా గంగూలీ
Sourav Ganguly

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీకి తొలిసారి ప్రధాన కోచ్‌గా గంగూలీ బాధ్యతలు చేపట్టనున్నాడు. గంగూలీకి ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇప్పటికే మంచి అనుబంధం ఉంది. గతంలో ఆ జట్టుకు దాదా డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా పనిచేశాడు. అంతకుముందు పలు సీజన్లలో మెంటార్‌గా కూడా వ్యవహరించాడు. రికీ పాంటింగ్‌ హెడ్‌ కోచ్‌గా ఉన్న సమయంలో ఢిల్లీ కోచింగ్‌ బృందంలో గంగూలీ భాగంగా ఉన్నాడు.


భారత క్రికెట్‌లో ఆటగాడిగా, కెప్టెన్‌గా, పరిపాలకుడిగా విశేష అనుభవం ఉన్న గంగూలీ.. ఇప్పుడు కోచ్‌గా తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవలే SA20 లీగ్‌లోని ప్రిటోరియా క్యాపిటల్స్‌కు కూడా తొలిసారి కోచింగ్‌ బాధ్యతలు చేపట్టాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి ఐపీఎల్‌లో కొత్త పాత్రలో కనిపించనున్నాడు. వ్యూహ రచనతో పాటు ఆటగాళ్లను నడిపించడంలో తన అనుభవాన్ని ఉపయోగించుకోనున్నాడు. గంగూలీకి భారత క్రికెట్‌ పరిపాలనలోనూ విశేష అనుభవం ఉంది. బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేయడంతో పాటు క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ (CAB) అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించాడు.


తొలి టైటిల్‌ కోసం..

ఐపీఎల్‌ ప్రారంభమైన 2008 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌ టైటిల్‌ కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఇప్పటివరకు ఆ జట్టు ఐపీఎల్‌ ట్రోఫీని గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో గంగూలీ నియామకంతో జట్టుకు కొత్త దిశ లభిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. జట్టు కోర్‌ సభ్యులతో గంగూలీకి ఇప్పటికే పరిచయం ఉండటం కూడా ఢిల్లీకి కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. 2027 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను తొలి ఐపీఎల్‌ టైటిల్‌ వైపు నడిపించడమే గంగూలీ ముందున్న ప్రధాన లక్ష్యంగా మారనుంది.


ఇవి కూడా చదవండి:

సూర్యకుమార్‌కు షాక్.. రంజీ ట్రోఫీలోనూ దక్కని చోటు

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ బాధ్యత అదే: టీమిండియా బౌలింగ్ కోచ్

Updated Date - Oct 06 , 2026 | 01:50 PM