Share News

ఐపీఎల్‌లో అరుదైన ఫీట్.. కోహ్లీ, సెహ్వాగ్ సరసన శ్రేయస్ అయ్యర్

ABN , Publish Date - May 24 , 2026 | 04:18 PM

శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఛేదనలో శతకం చేసిన నాలుగో కెప్టెన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ జాబితాలో స్టార్ ప్లేయర్లు సెహ్వాగ్, కోహ్లీ, సంజు శాంసన్ ఉన్నారు.

ఐపీఎల్‌లో అరుదైన ఫీట్.. కోహ్లీ, సెహ్వాగ్ సరసన శ్రేయస్ అయ్యర్
Shreyas Iyer

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక పోరులో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(101*) అజేయ శతకంతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనతను సాధించాడు. ఈ క్రమంలో స్టార్ ప్లేయర్లు కోహ్లీ, సెహ్వాగ్ సరసన నిలిచాడు.


లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ 51 బంతుల్లో అజేయంగా 101 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే ఐపీఎల్ చరిత్రలో ఛేదనలో శతకం చేసిన నాలుగో కెప్టెన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ జాబితాలో స్టార్ ప్లేయర్లు సెహ్వాగ్, కోహ్లీ, సంజు శాంసన్ ఉన్నారు. సెహ్వాగ్ 2011లో డెక్కన్ ఛార్జర్స్‌పై 119 పరుగులు, కోహ్లీ 2016లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌పై అజేయంగా 108 పరుగులు, సంజు శాంసన్ 2021లో పంజాబ్‌పైనే 119 పరుగులు చేసి ఈ జాబితాలో నిలిచారు.


మరో మైలురాయి..

ఇదే మ్యాచ్‌లో అయ్యర్ మరో మైలురాయిని కూడా అందుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 7 వేల పరుగులు పూర్తి చేశాడు. ఇప్పటివరకు 254 టీ20 మ్యాచ్‌ల్లో 7,076 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 48 అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో అయ్యర్ అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 498 పరుగులు చేశాడు. పంజాబ్ తరఫున ఇప్పటివరకు 31 మ్యాచ్‌ల్లో 1,102 పరుగులు సాధించాడు. కాగా లఖ్‌నవూపై విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో మళ్లీ నాలుగో స్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

అర్జున్ కోసం సారా టెండూల్కర్ ఎమోషనల్ పోస్ట్

ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా మహమ్మద్ షమీ..

Updated Date - May 24 , 2026 | 04:18 PM