Share News

ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. పంజాబ్ ఓపెనర్ అరుదైన ఘనత

ABN , Publish Date - May 24 , 2026 | 02:41 PM

పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు వేర్వేరు సీజన్లలో 500కు పైగా పరుగులు చేసిన తొలి అన్‌క్యాప్‌డ్ భారత ఆటగాడిగా నిలిచాడు.

ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. పంజాబ్ ఓపెనర్ అరుదైన ఘనత
Prabhsimran Singh

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ ఆరు ఓటముల తర్వాత ఎట్టకేలకు ఏడో విజయాన్ని నమోదు చేసింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు వేర్వేరు సీజన్లలో 500కు పైగా పరుగులు చేసిన తొలి అన్‌క్యాప్‌డ్ భారత ఆటగాడిగా నిలిచాడు.


ఈ మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రన్ కేవలం 39 బంతుల్లో 69 పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించాడు. మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య(0) మరోసారి విఫలమయ్యాడు. అయినప్పటికీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(101*)తో కలిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ సీజన్‌లో కూడా ప్రభ్‌సిమ్రన్ 500 పరుగుల మార్క్‌ను దాటాడు. గత సీజన్‌లో 549 పరుగులు చేసిన అతడు.. ఇప్పుడు వరుసగా రెండోసారి 500కు పైగా పరుగులు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందాడు.


మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ 44 బంతుల్లో 72 పరుగులతో రాణించగా, అబ్దుల్ సమద్ 37 పరుగులతో దూకుడుగా ఆడాడు. పంజాబ్ బౌలర్లలో చాహల్, యాన్సెన్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ దూకుడుగా ఆడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అజేయ శతకంతో (51 బంతుల్లో 101*) జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ప్రభ్‌సిమ్రన్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు ఏడు వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని అందించాడు. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో 15 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుంది.


ఇవి కూడా చదవండి:

అర్జున్ కోసం సారా టెండూల్కర్ ఎమోషనల్ పోస్ట్

ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా మహమ్మద్ షమీ..

Updated Date - May 24 , 2026 | 02:41 PM