మా ఓటమికి కారణం అదే: లఖ్‌నవూ కెప్టెన్ పంత్
ABN , Publish Date - May 24 , 2026 | 08:28 AM
ఐపీఎల్ 2026 సీజన్‌ను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై లఖ్‌నవూ కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌ను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. శనివారం ఏకానా స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఎల్ఎస్‌జీ పరాజయం పాలైంది. ఇక మ్యాచ్ అనంతరం ఓటమిపై లఖ్‌నవూ కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు. మంచు కారణంగానే 197 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయామని అన్నాడు. రెండో ఇన్నింగ్స్ సమయంలో కండిషన్స్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారాయని తెలిపాడు.
ఈ మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్ మాట్లాడుతూ.. 'ఈ సీజన్‌లో మా ప్రదర్శనను జీర్ణించుకోవడం కష్టమైన విషయమే. కానీ ఈ చేదు నిజాల్ని అంగీకరించక తప్ప. ఈ సీజన్ నుంచి మేము ఎంతో నేర్చుకున్నాం. ఇది మాకు చాలా కష్టమైన సీజన్. ఈ మ్యాచ్‌లో మేం మంచి పరుగులు చేశామని అనుకుంటున్నాను. అయితే రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం చాలా కష్టం. మంచు కారణంగా బ్యాటింగ్ సులువుగా మారుతుంది. అందుకే ప్రతి జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోవడానికి ఇష్టపడతారు' అని తెలిపాడు
'ఒక జట్టుగా మేం సానుకూల విషయాలను చూడాలనుకుంటున్నాం. జోష్ ఇంగ్లిస్, మిచ్ మార్ష్, ప్రిన్స్ యాదవ్ ఈ సీజన్‌లో అద్భుతంగా రాణించారు. గాయం నుంచి కోలుకుని మోహ్సిన్ ఖాన్ తిరిగి రావడం... షమీ ప్రదర్శన.. ఇవన్నీ మాకు సానుకూల అంశాలు. ఇది చాలా సుదీర్ఘమైన సీజన్. వచ్చే ఏడాది మరింత బలంగా తిరిగి వస్తామని మేం హామీ ఇస్తున్నాం' అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు. మొత్తంగా ఈ సీజన్‌ను నిరాశాజనకంగా ముగించినప్పటికీ వచ్చే సీజన్‌లో జట్టు మరింత బలంగా పుంజుకుంటుందని ఎల్‌ఎస్‌జి కెప్టెన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా మహమ్మద్ షమీ..